Trump Warns Iran: మేం తలుచుకుంటే ఒక్క దెబ్బతో వాళ్లందరినీ మట్టుబెట్టవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
మేం తలుచుకుంటే ఒక్క దెబ్బతో వాళ్లందరినీ మట్టుబెట్టవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Trump Warns Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వమంతా ప్రస్తుతం ఒకే చోట చేరి ఉందని.. అమెరికా అనుకుంటే ఒక్క దెబ్బతో (వన్ షాట్) వారందరినీ మట్టుబెట్టగలదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము ఆ పని చేయడం లేదని, ఎందుకంటే భవిష్యత్తులో చర్చలు జరపడానికి అమెరికాకు ఇరాన్ వైపు నుండి ఎవరైనా మిగలాలి కదా అని ఆయన స్పష్టం చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ (Axios) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. ఇరాన్ వ్యాప్తంగా వారం రోజుల పాటు జరుగుతున్న అంత్యక్రియల కార్యక్రమాల దృష్ట్యా ఇరుపక్షాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తాత్కాలిక విరామం ఇవ్వడం అనేది పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ వారం రోజుల విరామ సమయంలో ఏ పక్షం కూడా మరొకరిపై సైనిక దాడులు లేదా కాల్పులు జరపబోదని.. ఈ అంత్యక్రియల ప్రక్రియ ముగిసిన తర్వాతే చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని ట్రంప్ తెలిపారు.
టెహ్రాన్ వీధుల్లో ఖమేనీ మరణంపై వ్యక్తమవుతున్న అపూర్వమైన సంతాప దృశ్యాలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రజల నుండి తాను పూర్తిగా భిన్నమైన స్పందనను ఊహించానని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని తీవ్రంగా ద్వేషిస్తున్నారని తాను భావించానని.. అందువల్ల అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరానీయులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఆ దృశ్యాలపై అనుమానం వ్యక్తం చేస్తూ.. బహుశా అవి నకిలీ కన్నీళ్లు (Fake Tears) కావచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో హత్యకు గురైన ఖమేనీకి ఆఖరి నివాళులర్పించేందుకు శనివారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా వద్దకు పదివేల మంది ఇరానీయులు తరలివచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ప్రజలకున్న విధేయతను చాటిచెప్పేలా ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వారం రోజుల సంతాప కార్యక్రమాల్లో ఈ శనివారం నాటి వేడుక అత్యంత ప్రధాన ఘట్టంగా నిలిచింది.
ఈ అంత్యక్రియల వేడుకల్లో పాల్గొన్న అత్యధిక శాతం మంది ప్రజలు నల్లటి దుస్తులు ధరించి, ఇరాన్ జెండాలతో పాటు ఖమేనీ, ఆయన కుమారుడు (వారసుడు) అయిన మొజ్తబా ఖమేనీ చిత్రపటాలను చేతబూని ప్రార్థనా ప్రాంగణాన్ని నింపేశారు. దివంగత సర్వోన్నత నాయకుడి శవపేటికను, ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, కేవలం 14 నెలల వయసున్న మనవరాలి శవపేటికల పక్కన ఉంచి గాజు కింద భక్తుల సందర్శనార్థం ప్రదర్శించారు. ఆ సమయంలో అక్కడికి చేరిన జనసమూహం తమ ఛాతీలను బాదుకుంటూ.. విలపిస్తూ.. అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మరోవైపు, ఈ వేడుకల సమయంలో కొత్త సర్వోన్నత నాయకుడిగా భావిస్తున్న మొజ్తాబా చిత్రపటాలను విస్తృతంగా ప్రదర్శించినప్పటికీ, ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల జరిగిన దాడిలో ఆయన గాయపడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఈ అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజల నుండి ప్రతీకార కాంక్ష స్పష్టంగా వ్యక్తమైంది. తమ సర్వోన్నత నాయకుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికే తామంతా ఇక్కడికి వచ్చామని.. యునైటెడ్ స్టేట్స్‌తో తమకు ‘రక్తపగ’ ఉందని, అమెరికాతో సంబంధాలు ఎప్పటికీ మెరుగుపడవని పలువురు సంతాపకులు రాయిటర్స్ ప్రతినిధులతో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరాన్ నాయకత్వానికి ఇది అత్యంత కీలకమైన తరుణం. దేశంలోని మత పెద్దలు, సైనిక యంత్రాంగం తమ పాలనా వ్యవస్థను కాపాడుకుంటూ ఈ సంఘర్షణ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుండగా.. వాషింగ్టన్‌తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధికారులు తమ దౌత్య విజయంగా అభివర్ణించుకుంటున్నారు. ఆక్సియోస్ నివేదికల ప్రకారం.. ఈ తాత్కాలిక దౌత్య విరామం జూలై 9న అంత్యక్రియలు ముగిసే వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కాల్పుల విరమణ నిబంధనలు సక్రమంగా కొనసాగితే.. ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.