తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి?
What Is the Future of the Trinamool Congress? Challenges and Opportunities Ahead
‘వేయి పశువులను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలింది’ అనే నానుడి నేటి రాజకీయరంగంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌కు వర్తిస్తుంది. ఫైర్‌బ్రాండ్‌గా పిలవబడే మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకువచ్చి, సిపిఐ(ఎం) ప్రభుత్వంపై పోరాడేందుకు 1998 జనవరి 1న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. టాటాల నానో కార్ల ఫ్యాక్టరీకోసం వామపక్ష సంఘటన ప్రభుత్వం నందిగ్రాంలో రైతుల భూములు సేకరించటానికి వ్యతిరేంగా పెద్ద ఆందోళన నిర్వహించిన ఆమె 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 34సంవత్సరాల ఎల్.ఎఫ్ పాలనను అంతంచేసి అధికారం చేబట్టారు. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన ఆమె జాతీయ రాజకీయాల్లో బలమైన వాణిగా ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి 28 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులతో పార్లమెంటులో మూడవపెద్ద పార్టీగా టిఎంసి ఉందంటే రాష్ట్రంలో ఆమె పాలనకున్న బలాన్ని ఎన్ని అవకతవకలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, అణచివేతలు నిత్యకృత్యంగా ఉన్నప్పటికీ ఊహించుకోవచ్చు. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా పనిచేసిన మమతాబెనర్జీ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో బలమైన సిపిఐ(ఎం), కాంగ్రెస్‌లను నిందారోపణలతో, దౌర్జన్యాలతో, హింసా కృత్యాలతో అణగదొక్కారు. బిజెపి క్రమంగా ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. ఈ బలమైన ప్రాంతీయ పార్టీనుంచి అధికారం గుంజుకునేందుకు 2021 ఎన్నికల్లో తీవ్రమైన ప్రయత్నం చేసిన బిజెపి, మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సహాయం కూడా తీసుకుని తన లక్ష్యం నెరవేర్చుకుంది. అనూహ్యమైంది జరిగిపోయింది. తిరుగులేదనుకున్న మమతా బెనర్జీ రెక్కలు విరిగిన పక్షి అయింది. ఆమె కూడా ఓడిపోయారు. ఆమె దురవస్థపట్ల కనీసం సానుభూతి చూపే పార్టీ బెంగాల్‌లో లేకపోయిందంటే ఆమె ఎంతగా ఏకాకి అయినారో అర్థం చేసుకోవచ్చు.
దీని పర్యవసానం? మమతా బెనర్జీ స్థాపించిన పార్టీయే తనది కాకుండా పోయే పరిస్థితి నెలరోజుల్లోనే దాపురించింది. 80మంది టిఎంసి శాసనసభ్యుల్లో 58మంది తిరుగుబాటుచేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తమ సొంత మనిషి రిటబ్రత బెనర్జీని ప్రతిపాదించారు. మమత అంతకు ముందు రోజే అతన్ని పార్టీనుంచి బహిష్కరించారు. స్పీకర్ వెంటనే గుర్తింపు ఇచ్చారు. వారు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకున్నారు. తిరుగుబాటుదారులు వ్యూహాత్మకంగా ‘మమతా బెనర్జీ’ పట్ల విధేయత ప్రకటిస్తూ, పార్టీ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు, రాజకీయ వారసుడు అభిషేక్ బెనర్జీ అథారిటీని బహిరంగంగా నిరాకరించారు. ఈ తిరుగుబాటు కొద్దిరోజుల్లోనే కోల్‌కతా నుంచి న్యూఢిల్లీకి విస్తరించిందంటే ఇదంతా ఒక ‘అజ్ఞాత శక్తి’ మార్గదర్శకత్వంలో పథకం ప్రకారం జరుగుతున్నట్లు సులువుగానే ఊహించవచ్చు. ఒకప్పుడు మమతా బెనర్జీకి గట్టి అనుయాయి, లోక్‌సభలో పార్టీ మాజీ చీఫ్ విప్ శ్రీమతి కకోలీ ఘోష్ దస్తీదార్ తిరుగుబాటు ముఖంగా ముందుకు వచ్చారు. తమకు 20 మంది లోక్‌సభ సభ్యుల తోడ్పాటు ఉందని, తమను సభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాయటంతోపాటు తమ గ్రూపు ఎన్‌డిఎని బలపరుస్తుందన్నారు. అంటే వారి విధేయత మమతా బెనర్జీ నుండి నరేంద్రమోదీ, అమిత్ షా ల వైపు మారింది. 20 సంఖ్య ముఖ్యం. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు తప్పించుకోవాలంటే పార్టీ సంఖ్యాబలం లో మూడింట రెండు వంతులు వేరుపడాలి. కోల్‌కతాలో ఎమ్మెల్యేలు, ఢిల్లీలో లోక్‌సభ సభ్యులు నేర్పుగా ఆ ఆంక్షను అధిగమించే సంఖ్యలు కూర్చారు. అసెంబ్లీ స్పీకర్‌గాని, లోక్‌సభ స్పీకర్‌గాని లేఖలపై సంతకందారులను రూఢిపరుచుకున్న దాఖలాలు లేవు. రెండోవైపున, ప్రతిపక్ష నాయకునిగా అధికార అభ్యర్థిని తెలియజేస్తూ అభిషేక్ బెనర్జీ స్పీకర్‌కు రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు న్నాయని రిటబ్రత చేసిన ఫిర్యాదుపై సిఐడి విచారణ జరుగుతోంది. రాజ్యసభలో మరో వ్యూహం నడుస్తోంది. 11మంది టిఎంసి ఎంపిల్లో ముగ్గురు ఇప్పటికి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఖాళీలు భర్తీ చేయటానికి అసెంబ్లీనుంచి ఉప ఎన్నికలు వస్తాయి. బిజెపివారు, ఒక తిరుగుబాటుదారు ఆ స్థానాలు నింపవచ్చు. డీలిమిటేషన్, లోక్‌సభ సీట్లు పెంపుదల ద్వారా మహిళా రిజర్వేషన్ అమలు, ఒక దేశం ఒక ఎన్నికలు వంటి రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంకోసం పార్లమెంటు ఉభయసభల్లో కనీస మెజారిటీకోసం బిజెపి వ్యూహాలు పన్నుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తిరుగుబాటు ఆ దిశలో బిజెపికి పెద్ద ప్రోత్సాహం.
ఇప్పుడు మమత ఏమి చేస్తారు? తిరుగుబాటుదారుల ప్రకటనల ప్రకారం వారి పోరాటం టిఎంసి వారసత్వ రాజకీయంపై తప్ప మమతాబెనర్జీపై కాదు. ఆమె ఇప్పటికీ చాలామంది నాయకులకన్నా ఎక్కువ ప్రజాదరణగల వ్యక్తి. మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పక్కనబెట్టి తిరుగుబాటుదారులతో సయోధ్య సాధించటం సాధ్యమా? లేక ప్రజల్లోకి వెళ్లి బిజెపి ప్రభుత్వంపై, కేంద్ర నాయకత్వంపై పోరాటం కొనసాగిస్తూ సమయమొచ్చినపుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారా? ఇండియా కూటమి ఢిల్లీ సమావేశానికి మమతా బెనర్జీ స్వయంగా హాజరుకావటం, కూటమిని పటిష్టం చేదామని చెప్పటం, సోనియాగాంధీతో ముఖాముఖీ చర్చలు, రాహుల్‌తో అభిషేక్ బెనర్జీ చర్చలు దృష్ట్యా ఆమె పోరాటానికి సిద్ధమవుతున్నారని భావించవచ్చు. ఈలోపు పార్టీ పేరు, గుర్తు లీగల్‌గా చేజారిపోకుండా చూసుకోవటం అవసరం. ఏమైనా ఇది సంఖ్యల ఆట. మహారాష్ట్ర నాటకం గుర్తుచేసుకోదగింది. శివసేన, ఎన్‌సిపిలను బిజెపి చీల్చింది. మెజారిటీ సంఖ్యాబలంతో పార్టీపేరు, ఎన్నికల గుర్తు చీలిక గ్రూపులకు దక్కాయి.!