భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు.. గృహ హింస చట్టం కింద భర్తకు విధించిన శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు
Non-Communication in Marriage Cannot Automatically Amount to Cruelty: Supreme Court
వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సహజమని.. కేవలం ఒక భర్త 13 రోజుల పాటు తన భార్యతో మాట్లాడనంత మాత్రాన దానిని ‘క్రూరత్వం’ (Cruelty) కింద పరిగణించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి ,జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A కింద భర్తకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను.. దానిని సమర్థించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది. అలాగే సదరు వ్యక్తికి అతని పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ఒమన్‌లో నివసిస్తున్న భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా భార్య పుట్టింటికి వెళ్ళడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆమెతో 13 రోజుల పాటు మాట్లాడటానికి నిరాకరించాడు. ఈ లోపించిన సంభాషణ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన భార్య తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై 2015లో భర్త ,అతని కుటుంబ సభ్యులపై సెక్షన్లు 498A, 304B (వరకట్న మరణం) కింద కేసు నమోదైంది.
విచారణలో వరకట్న వేధింపుల ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారంతా నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే, భర్త ఉద్దేశపూర్వకంగా మాట్లాడకుండా ఉండి భార్యను ఆత్మహత్యకు పురికొల్పేంత తీవ్రమైన మానసిక క్రూరత్వానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ట్రయల్ కోర్టు అతనికి శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా దీనిని సమర్థించడంతో ఆ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
సుప్రీంకోర్టు ఎదుట భర్త తరఫున సీనియర్ న్యాయవాది ఆర్. బసంత్ వాదిస్తూ.. కేవలం మాట్లాడనంత మాత్రాన శిక్ష విధించడం చట్టబద్ధం కాదని నొక్కిచెప్పారు. దీనికి విరుద్ధంగా భర్త ప్రవర్తనే ఆమెకు తీవ్ర మానసిక క్షోభ కలిగించిందని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రమణియం వాదించారు. అయితే మానసిక క్రూరత్వానికి నిర్దిష్టమైన సూత్రం ఏదీ లేదని, అది ఆయా కేసుల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఒకరికి చిన్నదిగా అనిపించే గొడవ మరొకరికి తీవ్రమైన వేదన కలిగించవచ్చని.. కానీ క్రూరత్వాన్ని నిర్ధారించడానికి నిరంతర వేధింపుల వంటి బలమైన ఆధారాలు ఉండాలని కోర్టు తెలిపింది.
ప్రాసిక్యూషన్ తన వాదనను నిరూపించడానికి కేవలం మృతురాలి తల్లిదండ్రుల మౌఖిక సాక్ష్యంతో పాటు, భర్త నుండి ఎలాంటి సందేశాలు రాలేదని చూపే వాట్సాప్ (WhatsApp) చాట్‌లపై ఆధారపడింది. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపనంత మాత్రాన వారి మధ్య అసలు సంభాషణే జరగలేదనడానికి తగిన ఆధారం కాదని, ఎందుకంటే ఆ సంభాషణ సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా కూడా జరిగి ఉండవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. బలమైన సాక్ష్యాధారాలు లేనప్పుడు కేవలం 13 రోజుల పాటు మాట్లాడకుండా ఉండటాన్ని క్రూరత్వం అనలేమని స్పష్టం చేస్తూ.. కింది కోర్టుల తీర్పులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.