Skip to content
జాతీయం వార్తలు

మతం మారితే…. ఎస్సీ హోదా పోయినట్టే

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మతం మారితే…. ఎస్సీ హోదా పోయినట్టే

మతం మారితే.... ఎస్సీ హోదా పోయినట్టే

గత తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

మతం మారిన వ్యక్తి తిరిగి పూర్వపు మతంలోకి రావాలంటే..

మూడు షరతులు పాటించాల్సిందేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఎస్సి హోదాపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూ, సిక్కు, బౌద్ధమతం కాకుండా వేరే మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు తమ ‘ఎస్సి’ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇంతకు ముందు తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తిరస్కరించింది. 2026 మార్చి 24న తాము ఇచ్చిన తీర్పును పరిశీలించామని, అందులో ఎలాంటి తప్పులు కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2026 మార్చి 24న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా, ఇతర మతాల్లోకి మారిన ఎస్సి వ్యక్తి, పుట్టుకతో సంబంధం లేకుండా మత మార్పిడి జరిగిన క్షణం నుంచే ఎస్సి హోదా కోల్పోతారని స్పష్టం చేసింది. ‘ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే, అతను లేదా ఆమె తన ఎస్సి హోదాను తక్షణమే పూర్తిగా కోల్పోతారు’ అని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 క్లాజ్ (1) ప్రకారం, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన తెగలను నిర్ధరిస్తూ భారత రాష్ట్రపతి 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగల) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం, ఒక వ్యక్తి ఆ తెగకు చెందిన సంప్రదాయాలను నిజాయితీగా కొనసాగిస్తేనే ప్రయోజనాలు పొందగలరు. ఒకవేళ మత మార్పిడి జరిగినా లేదా తెగ ఆచారాలను దీర్ఘకాలంగా వదిలివేయడం వల్ల వారి గిరిజన గుర్తింపు రద్దు అవుతుంది. లేదా విచారణ ద్వారా ఆ గుర్తింపు ఉంచాలా, వద్దా అనేది తేల్చాల్సి ఉంటుందని తెలిపింది’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అలాగే హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని కాకుండా వేరే మతాన్ని అవలంబించే ఏ వ్యక్తినీ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేం. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వులోని క్లాజ్ 3 కింద ఉన్న ఈ నిబంధన స్పష్టమైనది, సంపూర్ణమైనది. నిర్దేశిత మతాలు కాకుండా వేరే మతంలోకి మారితే పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సి హోదా తక్షణమే, పూర్తిగా రద్దు అవుతుంది అని కోర్టు తేల్చిచెప్పింది.

ఎస్సి హోదా పోతే- ఆ ప్రయోజనాలన్నీ కట్

షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తి వేరే మతంలోకి మారినప్పుడు, కాలక్రమేణా ఆ తెగ ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, ఇతర లక్షణాలు అంతరించిపోయే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తి తన తెగ ఆచారాలను పూర్తిగా వదిలివేసి, మారిన మతంలోని పద్ధతులను అవలంబిస్తున్నట్లు రుజువు అయితే, ఆ వ్యక్తిని ఇకపై ఆ తెగలో భాగంగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొంది.

1950 నాటి ఉత్తర్వుల ప్రకారం, ఒక వ్యక్తి ఎస్సి హోదా కోల్పోయినప్పుడు, ఆ హోదా ఆధారంగా లభించే చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు, రిజర్వేషన్లు, అర్హతలు అన్నీ తక్షణమే, స్వయంచాలకంగా రద్దు అవుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ 1950 నాటి ఉత్తర్వు కేవలం హిందూ మతాన్ని అవలంబించే వారికి మాత్రమే ఎస్సీ హోదాను పరిమితం చేసింది. ఆ తర్వాత 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను ఇందులో చేర్చుతూ సవరణలు చేశారు.

‘ఈ సవరణల్లో ఎక్కడా క్రైస్తవ మతాన్ని చేర్చలేదు అనే విషయాన్ని గమనించాలి. క్రైస్తవ మత సిద్ధాంతాల ప్రకారం కుల వ్యవస్థకు గుర్తింపు లేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులం లేదా తెగ హోదాను కోరే వ్యక్తి, 1950 ఉత్తర్వుల ప్రకారం, నోటిఫై చేసిన కులానికి లేదా తెగకు చెందినవారై ఉండాలి. అంతేకాదు దానికి సంబంధించిన స్పష్టమైన, తిరుగులేని ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఒక వ్యక్తి నిర్దేశిత మతాలు కాకుండా, వేరే మతాన్ని పాటిస్తూ, అదే సమయంలో ఎస్సి హోదా ప్రయోజనాలను చట్టబద్ధంగా పొందలేరని స్పష్టం చేసింది.

హిందూ మతంలోకి మళ్లీ వస్తే?

మతం మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి మారినప్పుడు (రీకన్వర్షన్) ఎస్సి హోదా తిరిగి పొందాలంటే మూడు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోర్టు తెలిపింది. అవి ఏమిటంటే?

  1. సదరు వ్యక్తి మొదట 1950 ఉత్తర్వుల పరిధిలోని కులానికి చెందినవాడై ఉండాలి.
  2. తిరిగి స్వమతంలోకి మారినట్లు నమ్మదగిన ఆధారాలు ఉండాలి.
  3. ఆ మూల కులానికి చెందినవారు లేదా సమాజం అతనిని తిరిగి అంగీకరించి, తమలో కలుపుకున్నట్లు స్పష్టమైన సాక్ష్యాలు ఉండాలి.
ట్యాగ్‌లు: Supreme Court