Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబుకు కలిసి వచ్చిన జెన్ జీ ఉద్యమం… కమలం కుట్రలకు బ్రేక్…

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుకు కలిసి వచ్చిన జెన్ జీ ఉద్యమం… కమలం కుట్రలకు బ్రేక్…

Chandrababu Naidu

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తాజాగా ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం కలిసి వచ్చిందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ జోరుకు ఈ ఉద్యమం కళ్లెం వేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం టీడీపీ, జేడీయూ మద్దతుపైనే ఆధారపడి నెగ్గడం అమిత్ షా వర్గానికి మొదట్లో జీర్ణించుకోలేని విషయమే. ఈ బలహీనతను తొలగించేందుకు బీజేపీ పావులు కదిపి, ఇప్పటికే బీహార్‌లో జేడీయూను దెబ్బతీసి, నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దూరం చేసి, ఆ పార్టీ ఎంపీలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుందనే వాదనలున్నాయి. అలాగే బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి ఎంపీలను లాక్కుని బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. ప్రస్తుతం చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి నుంచి బీజేపీ కొంతవరకు బయటపడిందనే చెప్పాలి.

ఇదే అదనుగా భావించిన అమిత్ షా, ఇక ఏపీలో చంద్రబాబును టార్గెట్ చేసి ఆయనకు రాజకీయంగా చికాకులు సృష్టించేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే తరుణంలో ఢిల్లీలో ఊహించని విధంగా తలెత్తిన ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమం బీజేపీ రాజకీయ సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఈ ఆందోళనలతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్డీఏలోని కీలక మిత్రపక్షాలను దూరం చేసుకుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అధికారం చేజారిపోవడం ఖాయమనే భయం కమలనాథులను వెంటాడుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బీజేపీకి ప్రత్యామ్నాయ మిత్రపక్షం దొరికే అవకాశం లేదు. వైసీపీ నేరుగా ఎన్డీఏలో చేరే సాహసం చేయలేదు. మరోవైపు టీడీపీతో పోలిస్తే జనసేనకు రాష్ట్రంలో ఆ స్థాయి రాజకీయ బలం లేదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో హంగ్ ఏర్పడి కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సంక్లిష్ట సమీకరణాలన్నింటినీ బేరీజు వేసుకున్న బీజేపీ, ప్రస్తుతానికి టీడీపీని ఇరుకున పెట్టే సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఊహించని విధంగా తెరపైకి వచ్చిన జెన్ జీ ఉద్యమం ప్రస్తుతానికి చంద్రబాబుకు ఒక కవచంలా మారి, ఆయనకు రాజకీయంగా బాగా కలిసి వచ్చిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ట్యాగ్‌లు: BJP Chandrababu Gen Z movement