Ram Temple Donation Case: రామ మందిరం విరాళాల నిధుల మళ్లింపు కేసు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
Ram Temple Donation Case: అయోధ్యలోని రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై న్యాయపరమైన విచారణ ముందుకు సాగనుంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే నిందితులపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయంపై తాము ఎలాంటి అభిప్రాయం వెల్లడించడం లేదని స్పష్టం చేసింది.
సోమవారం జరిగిన విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించే బాధ్యతలు నిర్వహించిన కొందరు సిబ్బంది నిధులను పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఆ డబ్బును పెట్టుబడుల కోసం, బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఉపయోగించినట్లు అనుమానాలు ఉన్నాయని వివరించారు.
105 ఘటనలను గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం
ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది. ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ రికార్డులతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించింది. విరాళాల నగదు లెక్కించే గదిలో డబ్బును తీసుకెళ్లడం లేదా దాచిపెట్టడం జరిగినట్లు అనుమానిస్తున్న 105 సందర్భాలను గుర్తించింది.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా 173 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. నగదు మళ్లింపు ఆరోపణలు, సంబంధిత వ్యక్తుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా ఛార్జిషీట్లో పొందుపరిచారు.
బంగారు, ఇతర విలువైన కానుకలపైనా పరిశీలన
భక్తులు ఆలయానికి సమర్పించిన విలువైన వస్తువుల వ్యవహారాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలించారు. ఆలయ రికార్డుల్లో నమోదైన 803 వస్తువులను ప్రత్యక్షంగా తనిఖీ చేయగా ఎలాంటి తేడాలు గుర్తించలేదని విచారణలో వెల్లడైంది. రసీదులు అందుబాటులో లేని మరో 86 విలువైన వస్తువులను ప్రత్యేకంగా పరిశీలించారు.
ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు అనుమతి
దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ దాఖలైనందున కేసును విచారిస్తున్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తదుపరి న్యాయ ప్రక్రియను చట్టప్రకారం కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో పిటిషనర్లు తమ వాదనలు వినిపించడంతో పాటు అవసరమైన సహకారం అందించేందుకు కూడా అనుమతించింది.
అయితే నిందితులపై వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. కేసులోని వాస్తవాలు, ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ట్రయల్ కోర్టుదేనని పేర్కొంది. దీంతో రామ మందిరం విరాళాల నగదు మళ్లింపు ఆరోపణలపై దిగువ కోర్టులో విచారణ కొనసాగనుంది.