US Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో 57 మంది భారతీయ అమెరికన్లు.. కీలక పదవుల కోసం పోటీ!
US Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో 57 మంది భారతీయ అమెరికన్లు.. కీలక పదవుల కోసం పోటీ!
US Elections: అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వారి ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. మంగళవారం జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో మొత్తం 57 మంది భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల వరకు పలు పదవుల కోసం వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఐఏఎన్ఎస్ సేకరించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో ఒకరు సెనేట్ స్థానానికి, 11 మంది ప్రతినిధుల సభకు, ముగ్గురు రాష్ట్రస్థాయి పదవులకు, 36 మంది రాష్ట్ర శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. మరో ఆరుగురు స్థానిక ప్రభుత్వ పదవుల కోసం ఎన్నికల బరిలో ఉన్నారు. భారతీయ మూలాలు ఉన్నట్లు నిర్ధారించగలిగిన అభ్యర్థులను మాత్రమే ఈ లెక్కలో చేర్చారు. మరో 15 మంది విషయంలో వారి భారతీయ వారసత్వానికి సంబంధించి స్పష్టత లేకపోవడంతో జాబితాలో చేర్చలేదు.
గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పోటీల్లో ఒహియో గవర్నర్ ఎన్నిక ఒకటి. రిపబ్లికన్ పార్టీ తరఫున వివేక్ రామస్వామి, డెమొక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్‌తో తలపడుతున్నారు. ఆదివారం నాటి FiftyPlusOne పోలింగ్ సగటు ప్రకారం అమీ ఆక్టన్‌కు సుమారు మూడు శాతం ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది.
లాస్ ఏంజెలెస్ మేయర్ పదవి కోసం కూడా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌కు వ్యతిరేకంగా నగర కౌన్సిల్ సభ్యురాలు నిత్యా రామన్ పోటీ చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ నిర్వహించిన చివరి సర్వేలో ఇద్దరికీ చెరో 40 శాతం మద్దతు లభించింది. మరో 19 శాతం మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.
న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికలో రిపబ్లికన్ అభ్యర్థి సరిత కొమటిరెడ్డి, ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్‌ను ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 28న విడుదలైన Siena సర్వేలో జేమ్స్‌కు 54 శాతం, సరితకు 39 శాతం మద్దతు నమోదైంది.
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ మరోసారి డెమొక్రటిక్ పార్టీ తరఫున అదే పదవికి పోటీ చేస్తున్నారు. మసాచుసెట్స్ సెనేట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శివ అయ్యదురై, డెమొక్రటిక్ సెనేటర్ ఎడ్ మార్కీతో పోటీపడుతున్నారు.
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో 11 మంది భారతీయులు
ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్న 11 మందిలో ఇప్పటికే పదవుల్లో ఉన్న నలుగురు డెమొక్రటిక్ సభ్యులు కూడా ఉన్నారు. కాలిఫోర్నియా నుంచి రో ఖన్నా, అమీ బేరా, వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్, వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
రెండు నియోజకవర్గాల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. కాలిఫోర్నియాలోని 17వ నియోజకవర్గంలో రో ఖన్నాకు రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టాండన్ సవాల్ విసురుతున్నారు. వాషింగ్టన్‌లోని 7వ నియోజకవర్గంలో ప్రమీలా జయపాల్‌ను రిపబ్లికన్ అభ్యర్థి, గుజరాత్‌లో జన్మించిన మాజీ అమెరికా మెరైన్ నిరవ్ షేత్ ఎదుర్కొంటున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ డెమొక్రటిక్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అరిజోనాలోని 1వ నియోజకవర్గం నుంచి అమిష్ షా, ఫ్లోరిడాలోని 22వ నియోజకవర్గం నుంచి పియా దండియా పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలను ఎన్నికల పరిశీలకులు పోటాపోటీగా ఉండే నియోజకవర్గాలుగా గుర్తించారు.
ఇతర అభ్యర్థుల్లో నార్త్ కరోలినాలోని 4వ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ అభ్యర్థి మహేష్ ‘మ్యాక్స్’ గనోర్కర్, ఒహియోలోని 13వ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి సందీప్ దీక్షిత్, మిషిగన్‌లోని 11వ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి అనిల్ కుమార్ ఉన్నారు.
22 రాష్ట్రాల్లో 36 మంది పోటీ
రాష్ట్ర శాసనసభ స్థానాల కోసం 22 రాష్ట్రాల్లో మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు పోటీలో ఉన్నారు. వీరిలో కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, న్యూయార్క్ రాష్ట్రాల నుంచి నలుగురేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు.
స్థానిక ఎన్నికల్లోనూ భారతీయ సంతతి అభ్యర్థులు తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉటాలోని సాల్ట్ లేక్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా కొనసాగుతున్న సిమ్ గిల్, ఓక్లాండ్ కౌన్సిల్ సభ్యురాలు జనని రామచంద్రన్, జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ కమిషన్ స్థానానికి పోటీ చేస్తున్న రోహిత్ మల్హోత్రా ఈ జాబితాలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు
ఎన్నికల చివరి దశలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచార ఖర్చులు, విరాళాలు కూడా పెరిగాయి. ఫ్లోరిడాలో పియా దండియాకు మద్దతుగా ఏర్పాటైన Floridians for Affordability అనే సూపర్ పీఏసీ అక్టోబర్ 30న ప్రచార సందేశాల కోసం సుమారు 14 వేల డాలర్లు ఖర్చు చేసింది. దీంతో ఆమెకు అనుకూలంగా ఆ సంస్థ చేసిన మొత్తం వ్యయం సుమారు 2.20 లక్షల డాలర్లకు చేరింది.
మరోవైపు అమిష్ షా ప్రచార బృందం అక్టోబర్ 30న అందిన 15 విరాళాల ద్వారా మొత్తం 26 వేల డాలర్లు సమీకరించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 25 నుంచి 30 మధ్య అందిన విరాళాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆరు నివేదికల ప్రకారం సుమారు లక్ష డాలర్ల నిధులు నమోదయ్యాయి. ఈ వివరాలు అభ్యర్థులు, సంబంధిత సంస్థలు స్వయంగా వెల్లడించినవే. వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మొత్తంగా అమెరికాలోని వివిధ రాజకీయ వ్యవస్థల్లో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు ఈ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య స్పష్టం చేస్తోంది. నవంబర్ 3న జరగనున్న పోలింగ్ ఫలితాలు వీరి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.