HYDRAA Commissioner Row: హైడ్రా రంగనాథ్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఆచితూచి అడుగులు వేస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్..
Ranganath and Revanth Reddy
HYDRAA Commissioner Row: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా (HYDRAA), దాని కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు.. కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడం అసాధారణమని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, ప్రజా ఆస్తుల పరిరక్షణ నెపంతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకూ లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రంగనాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారా లేక వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ రాజకీయ, పాలనా వర్గాల్లో జోరందుకుంది.
అయితే ఈ విషయంలో ఏమాత్రం తొందరపడకూడదని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని అధికారికంగా అందుకుని.. దానిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ.. సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై అడ్వొకేట్ జనరల్ (AG) తో పాటు ఇతర న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే రంగనాథ్ వ్యక్తిగత హోదాలో కేసు ఎదుర్కొంటున్నందున అప్పీల్‌ను ప్రభుత్వం తరఫున వేయాలా లేక రంగనాథ్ వ్యక్తిగతంగా వెళ్లాలా అనే అంశంపై న్యాయ సలహాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఈ పరిణామాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం స్పందించారు. తనపై నమోదైన 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కబ్జాదారుల నుంచి రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గత రెండేళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించామని వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు చర్యలన్నీ రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపటామని, తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందో లేక వేరే నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.