Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు పోలీసులు కీలక సూచన..

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు పోలీసులు కీలక సూచన..

Tomorrow Weather Update: Five cyclonic systems simultaneously across the country; extremely heavy rains until July 27.

Telangana Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటకు మూడు కిలోమీటర్ల నెమ్మది వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఆ కారణంగానే ఆగస్టు మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేకించి ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపై ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాజధాని హైదరాబాద్‌ నగరంలో సైతం వాతావరణం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నగరంలోని ఐటీ కంపెనీల యాజమాన్యాలకు ప్రత్యేక సూచనలు చేస్తూ, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా , ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా ముందస్తుగా లాగ్‌అవుట్‌ అయ్యేందుకు అనుమతించాలని కోరింది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో అనేక చోట్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లాలో 6.9 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 6.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.

జూన్, జులై నెలల్లో కలిపి దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం లోటు నమోదైంది. దీని మూలంగా రాష్ట్రంలోని సుమారు 26 జిల్లాల్లో వర్షాభావ , దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర నిరాశలో ఉన్న అన్నదాతలకు ప్రస్తుత వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఈ హెచ్చరికలతో రైతులు సాగు పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు తెలంగాణకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువన ఉన్న ప్రాజెక్టులకు ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. జూరాల ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, శ్రీశైలం డ్యామ్‌కు 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోనూ పరిస్థితి మెరుగ్గా ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల వల్ల జైక్వాడి ప్రాజెక్టుకు ఏకంగా 63,618 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ వర్షాలు తెలంగాణలోని తాగు, సాగునీటి కష్టాలను కొంతవరకు తీరుస్తాయని భావిస్తున్నారు.