జూలై 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు.. కొనుగోలుదారులకు బిగ్ షాక్
Tata Motors Price Hike From July 1 Comes as Shock for Car Buyers
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన కస్టమర్లకు షాక్ ఇస్తూ, ప్రయాణికుల వాహనాల (Passenger Vehicles) ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెరిగిన కొత్త ధరలు రాబోయే జులై 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. వాహనాల మోడళ్లను బట్టి గరిష్ఠంగా 1.5 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ధరల పెంపు సాధారణ ఇంధన (ICE) మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) కూడా వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయం (Input Costs), ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాటా మోటార్స్ వివరించింది.
వాహనాల ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ఆ భారంలో అత్యధిక భాగాన్ని కంపెనీయే భరిస్తోందని సంస్థ పేర్కొంది. అయితే అనివార్య పరిస్థితుల్లో కొంత భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని తెలిపింది. ఈ ధరల పెంపు అన్ని మోడళ్లపై ఒకేలా ఉండదని, ఎంచుకునే వాహనం ,వేరియంట్‌ను బట్టి ఈ మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. టాటా మోటార్స్ నుండి హారియర్, సఫారీ, నెక్సాన్, పంచ్, టియాగో వంటి ప్రముఖ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ రంగంలో కార్ల ధరల పెంపు అనేది సర్వసాధారణంగా మారింది. టాటా మోటార్స్ కంటే ముందే గత నెలలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా ముడి పదార్థాల ఖర్చులు పెరగడంతో తన వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.12,800 వరకు పెంచింది. అలాగే దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా జూన్ నెల నుండి వివిధ మోడళ్లపై రూ.30,000 వరకు ధరలను పెంచగా, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే తన ఎస్‌యూవీలు (SUVs) ,కమర్షియల్ వాహనాల ధరలను సవరించింది.
టాటా మోటార్స్ ధరల పెంపు ప్రకటన వెలువడిన అనంతరం, స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు స్వల్ప లాభాలతో సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. వాహన తయారీ సంస్థలు ఒకవైపు తమ లాభదాయకతను (Profitability) కాపాడుకుంటూనే, మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, అధునాతన సాంకేతికతలపై పెట్టుబడులు కొనసాగించేందుకే ఈ విధమైన ధరల సవరణల మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.