Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tarimela Nagi Reddy: సంచలనం సృష్టించిన తరిమెల నాగిరెడ్డి కుట్రకేసు!

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Tarimela Nagi Reddy: సంచలనం సృష్టించిన తరిమెల నాగిరెడ్డి కుట్రకేసు!

(జులై 28, నేడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా)

ముప్పాళ్ళ భార్గవ శ్రీ

1969 డిసెంబర్‌ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్‌లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్ట్‌ విప్లవకారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి రాష్ట్ర కమిటీ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డివి), తరిమెల నాగిరెడ్డి (టిఎన్‌) తదితర నాయకులు ఉండగా చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని ఫలితంగా అరెస్టు కాలేదు. మద్రాసు సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా, జలగం వెంగళరావు హోం మంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్రకేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్రకేసు’ అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్రకేసు’గా బహుళ ప్రచారం పొందింది.

దీనికి ముఖ్యమైన కారణం వీరిపై పెట్టబడిన కుట్ర కేసును డివి, టిఎన్‌లు స్వయంగా వాదించి.. మేము ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్రపన్నలేదు, కమ్యూనిస్టులు ఎప్పుడూ తమ భావాలను బాహాటంగా ప్రకటిస్తారని.. ప్రకటించి సంచలనం సృష్టించారు. వీరు స్వయంగా కోర్టులో వాదించటానికి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, భారత విప్లవోద్యమంలోనూ నాటి విప్లవకారులు నెలకొల్పిన విప్లవ సంప్రదాయాల వెలుగులో డివి, టిఎన్‌లు నడిచారు. వారికి ప్రేరణ కలిగించిన వాటిలో ముఖ్యమైనది రీచ్‌స్టాగ్‌ కుట్ర కేసు. బల్గేరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జార్జ్ డిమిట్రావ్ బెర్లిన్‌లోని పార్లమెంటు భవనం రీచ్‌స్టాగ్‌ని తగలబెట్టారనే నెపంతో పెట్టిన కుట్రకేసులో డిమిట్రోవ్‌ తాను స్వయంగా కోర్టులో వాదించి నిర్దోషిగా బయటపడి సంచలనం సృష్టించారు. మనదేశంలో బ్రిటిష్‌ వాళ్ళ చేత పెట్టబడిన మీరట్‌, కాన్పూర్‌ కుట్రకేసుల్లో ముద్దాయిలు కోర్టులో తాము కమ్యూనిస్టులమని సగర్వంగా ప్రకటించుకున్నారు. టిఎన్‌, డివిలు కుట్ర కేసుల విషయంలో ఆనాటి కమ్యూనిస్టు నాయకులు పెట్టిన వరవడిని ఆదర్శంగా తీసుకున్నారు.

మద్రాసులో అరెస్టయిన వీరిపై పెట్టబడిన కుట్ర కేసును 1969 ఏప్రిల్‌ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనములో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్‌ ఆధారంగా ప్రభుత్వం బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ’తక్షణ కార్యక్రమం’ ఆధారంగా దానిని ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి పన్నిన కుట్రగా ముద్ర వేయడానికి పూనుకుంది. 1970 జూన్‌లో ఈ కుట్ర కేసు విచారణ హైదరాబాద్‌ అదనపు సెషన్స్‌ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో డివి, టిఎన్‌లు కమ్యూనిస్టు విప్లవకారులు రూపొందించిన మౌలిక డాక్యుమెంటు అయిన ’తక్షణ కార్యక్రమం’ను సొంతం చేసుకొని, దాన్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. అంతేకాదు ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసికూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవ సంప్రదాయాలకు పట్టం కట్టారు. అందరూ ఊహించినట్టుగానే హైదరాబాద్‌లో ని సెషన్స్‌ కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు ఈ శిక్షలను ఖరారు చేసింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్‌ కండిషన్స్‌ పైన జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్‌ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో ఈ కుట్ర కేసులో ఉన్న ముఖ్య నాయకులందరూ డివి, టిఎన్‌లతో సహా రహస్యజీవితానికి వెళ్లిపోయారు.

కామ్రేడ్స్‌ డివి, టిఎన్‌లు ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్‌మెంట్‌ను కుట్రకేసులో ఉన్న అందరి తరపున డివి తయారుచేసి కేసు విచారణ సందర్భంగా కోర్టులో వివరించారు. ఈ ప్రకటన డివి స్టేట్‌మెంట్‌గా బహుళ ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టిఎన్‌ ‘తాకట్టులో భారతదేశం‘ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన జాతీయ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమం’కు అన్వయించి రాసిన స్టేట్‌మెంట్‌ను టిఎన్‌ కోర్టులో రెండు గంటలపాటు ఎంతో శక్తివంతంగా వివరించారు. కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతున్నామో వివరించారు. ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో వాటిని రాజకీయంగా సమర్థించుకుంటూ కోర్టులో బాహాటంగా ప్రకటించటం విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్‌ శిఖరం అంత ఎత్తుకు పెంచింది.

ఈ కుట్ర కేసులో పెట్టబడిన ముద్దాయిలు డివి, టిఎన్‌లతో సహా ముఖ్య నాయకులు పి రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, మాదల నారాయణస్వామి, వసంతాడ రామలింగాచారి, మండ్ల సుబ్బారెడ్డి, ఎన్ వి కృష్ణయ్య, చల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పుల మోహన్‌ రెడ్డి తదితరులు వివిధ కారణాలతో చనిపోయారు. అయితే జూలై నెలకున్న ప్రాధాన్యత ఏమిటంటే ఈ కుట్ర కేసులోని ప్రముఖ నాయకులు డివి అనారోగ్యంతో జులై 12, 1984లో చనిపోగా, టిఎన్‌ ఎమర్జెన్సీ కాలములో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్‌లో జులై 28, 1976లో చనిపోయారు. రాజీలేని పోరాటం సాగించిన భారత విప్లవోద్యమ ముద్దుబిడ్డలు డివి, టిఎన్‌లకు విప్లవ జోహార్లు అర్పిద్దాం!

“పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం” తరిమెల నాగిరెడ్డి చెరుకూరి సత్యనారాయణ

“ఇప్పటి వరకూ కమ్యూనిస్టులంటే నాకు చాలా చులకన భావం ఉండేది. ఈ రోజు నీ ఉపన్యాసం విన్న తర్వాత ఆ భావం పోవటమేగాక మీ పార్టీపై గౌరవభావం ఏర్పడింది” మద్రాసు నగరంలో 1952లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సిపిఐ నాయకులు తరిమెల నాగిరెడ్డి మూడు గంటలు ఉపన్యాసమిచ్చి అలసిపోయి క్వార్టర్సుకి వెళ్ళి నిద్రపోతుంటే ఆయన లేచిన దాకా వేచి ఉండి ప్రఖ్యాత చరిత్రకారులు, రచయిత వెల్లంపల్లి సోమశేఖర శర్మ గారన్న మాటలవి. ఆనాటి ఆందోళన ఫలితంగా కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర శాసనసభలో కూడా నాగిరెడ్డి గారే ప్రతిపక్ష నాయకులు. రాజాజీ, ప్రకాశం పంతులు లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రుల ముందు ప్రతిపక్ష నాయకునిగా అధికారపక్షంతో సమానంగా బలమున్న కమ్యూనిస్టు పక్షనాయకునిగా రాణించి అసాధారణమైన ప్రతిభ కన్పరచి ప్రజల జేజేలు అందుకున్న వ్యక్తి తరిమెల నాగిరెడ్డి.

తరిమెల నాగిరెడ్డి గారు ప్రముఖ పాత్రికేయులు విద్వాన్‌ విశ్వం గారితో కలిసి వారి స్వగ్రామం తరిమెల వీధి బడిలో చదివారు. జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన ఋషివ్యాలి స్కూలుకు ఆర్థికంగా భూరి విరాళమిచ్చిన నీలం చిన్నపరెడ్డి, తరిమెల సుబ్బారెడ్డి గార్లు వారి పెద్దకుమారులైన నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి గార్లని ఆ స్కూలులో చేర్పించారు. అక్కడి నుండి మద్రాసు అడయార్‌ (గిండీ)లోని థియోసాఫికల్‌ స్కూల్‌లో చేరిన నాగిరెడ్డి అనీబిసెంట్‌ స్వయం పర్యవేక్షణలో పెరిగారు. ఆ తర్వాత మద్రాసు లయోలా కాలేజీలో చదివారు. ఇక్కడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. లయోలా కాలేజ్‌ వాతావరణం జాతీయోద్యమానికి వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయంతో తర్వాత చదువులకు కాశీ (బెనారస్‌) హిందూ విశ్వ విద్యాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి సుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినా ఆనాటి రాయలసీమ కాంగ్రెసు నాయకులు కల్లూరి సుబ్బారావు గారిని తోడుగా ఇచ్చి నాగిరెడ్డిని బెనారస్‌ పంపించాడు. నాగిరెడ్డితో పాటు నీలం రాజశేఖరరెడ్డి కూడా బెనారస్‌కి బయలు దేరాడు. వీరు బెనారస్‌ వెళ్తూ దారిలో వార్ధాలో దిగి గాంధీ ఆశ్రమానికి వెళ్ళారు.

నాగిరెడ్డి 1939లో బెనారస్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు నాగిరెడ్డే. అప్పటికే ఆయన అచ్యుత పట్వర్ధన్, కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాష్‌ నారాయణల వలన ప్రభావితుడై గాంధీ మార్గంపై విశ్వాసం సడలి, సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే శక్తి కమ్యూనిజానికి ఉందని నమ్మి పార్టీ సభ్యుడిగా మారాడు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భరద్వాజ గారి ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం విరివిగా చదివాడు. లా డిగ్రీ తీసుకుని వచ్చి ప్రాక్టీసు చేస్తాడని ఆశతో అనంతపురం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో పెద్ద మేడ కట్టించి ఎదురుచూస్తున్న ఆయన తండ్రి సుబ్బారెడ్డి లా డిగ్రీ లేకుండా రెండు ట్రంకు పెట్టెల నిండా కమ్యూనిస్టుల సాహిత్యం తీసుకుని రైలుదిగిన కుమారుణ్ణి చూసి హతాశుడయ్యాడు. ఇక తను ఊహించే స్థాయికి నాగిరెడ్డి పనికిరాడని నిర్ణయించుకొని తన అల్లుడు మేనల్లుడు అయిన నీలం సంజీవరెడ్డి ఎదుగుదలకు తోడ్పడాలని నిర్ణయించుకున్నాడు.

ఆ నిర్ణయంతో సుబ్బారెడ్డి కొడుక్కి, అతను నాయకునిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ, పార్టీకి అండగా ఉన్న తరిమెల గ్రామ పేద ప్రజలకు వ్యతిరేకంగా మారి, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ భూముల నుండి బేదఖల్‌ చేస్తూ అజ్ఞాతంలో ఉన్న నాగిరెడ్డిని పట్టుకునేందుకు కాపలా మనుషుల్ని ఏర్పాటు చేసి పార్టీ కదలికలు పోలీసులకు చేరవేస్తూ ప్రజా కంటకునిగా మారటంతో తండ్రిని చంపాలనే నిర్ణయానికి వచ్చిన నాగిరెడ్డి ఆ విషయాన్నే తెలియజేస్తూ తండ్రికి లేఖ రాశాడు. ఈ విషయాలన్నీ వివరిస్తూ సోదరుడు కృష్ణారెడ్డికి మరో ఉత్తరం రాస్తూ విషయాలన్నీ తల్లికి తెలియజేయమని కోరాడు. పార్టీలో కొందరు ఆమోదించనందున ఇతరత్రా కారణాల వలన సుబ్బారెడ్డిని చంపటం కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గ్రామంలో బహిరంగ సభ జరిపి తన మామకు ఏమైనా హాని జరిగితే గ్రామంలోని కమ్యూనిస్టులందర్నీ కాల్చి చంపి, వారి గృహాల్ని నేలమట్టం చేస్తామని సంజీవరెడ్డి రెచ్చగొట్టాడు.

తండ్రికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిల్చిన నాగిరెడ్డి ప్రజా నాయకునిగా జిల్లాలో స్థిరపడ్డాడు. తర్వాతి కాలంలో ఎన్నికలు జరగటం 1952లో సంజీవరెడ్డిపై జైలు నుండే నాగిరెడ్డి గెలవటం, సురక్షితమైన అనంతపురం నియోజకవర్గం వదలి పుట్లూరు నియోజకవర్గానికి మారి 55 మధ్యంతర ఎన్నికల్లో నాగిరెడ్డి ఓడిపోయి 1957 ఎన్నికల్లో అనంతపురం నుండి పార్లమెంటుకి ఎన్నిక కావడం, 1962లో పుట్లూరు నుండే గెలవటం, 55, 62 రెండుసార్లూ తన కజిన్‌ రామచంద్రారెడ్డే ప్రత్యర్థిగా ఉండటం, 1967లో అనంతపురం నుండి శాసనసభకు ఎన్నికవ్వటం అంతా ఒక చరిత్ర. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోనూ, కర్నూలు రాజధానిగా ఉన్న శాసనసభలోనూ ప్రతిపక్ష నాయకునిగా, 1962 తర్వాత ప్రతిపక్ష ఉపనాయకునిగా (గన్నవరం నుండి శాసనసభకు ఎన్నికైన సుందరయ్య గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు) 57 నుండి 62 వరకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన నాగిరెడ్డి 1966లో విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగానూ, 1969లో చట్టసభలపై విశ్వాసం కోల్పోయాననే కారణంతోనూ శాసన సభత్వానికి రాజీనామా చేశారు.