Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial: ఈ ప్రశ్నకు బదులేదీ?

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ఈ ప్రశ్నకు బదులేదీ?

CJP Responds PM Modi Message

జులై 20న కాక్రోచ్‌ జనతాపార్టీ (సిజెపి) పార్లమెంట్‌ మార్చ్‌ సందర్భంగా విద్యార్థులపై పాశవికంగా దాడులు చేయటానికి ఆదేశాలిచ్చిందెవరు? హోంమంత్రి అమిత్‌ షా జవాబుదారీతనం వహించరా? ఈ రోజు (జులై 27) పార్లమెంటు ఉభయ సభలు ప్రభుత్వ శాసన ఎజెండా చేపట్టకుండానే పలుమార్లు వాయిదాపడి, చివరకు సభాపతులు రేపటికి వాయిదా వేయటానికి కారణం ఈ ప్రశ్నలే.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదివారంనాడే హోంమంత్రి అమిత్‌ షాకు రాసిన లేఖలో, ఢిల్లీలో 20వ తేదీన శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న విద్యార్థులపై పాశవిక దాడికి షా జవాబుదారీతనం వహించాలని కోరారు. ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ పోలీసులు హోంమంత్రిత్వశాఖ కిందే పనిచేస్తారు. “వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థినులపై మగపోలీసులు దాడి చేశారు, అసభ్యంగా ప్రవర్తించారు. ప్రాణాంతకమైన పెల్లెట్‌ తుపాకులు ఉపయోగించటం మహాదారుణం. హోం మంత్రిగా మీరు, విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ సహా దారుణమైన బలప్రయోగానికి పాల్పడటాన్ని ఆమోదిస్తారా? మీరు కాకపోతే ఎవరు అనుమతించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడిచేస్తూ కనిపించినవారు పోలీసులా? వలంటీర్లా? వారిని నియోగించిందెవరు? మన సొంత దళాలు భారతదేశ భవిష్యత్‌పై కాల్పులు జరపటాన్ని మేము అనుమతించబోము. దీన్ని పార్లమెంటులో ప్రధాన సమస్యగా లేవనెత్తుతాం” అని రాహుల్‌ ముందే హెచ్చరించారు.

వారం రోజుల వాష్‌ఔట్‌ తదుపరి సోమవారం పునఃప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో అదే జరిగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రశ్నాపత్రాల లీకేజీపై దోషులకు శిక్షలు, జరిమానాలు పెంపుచేసే బిల్లును ప్రవేశపెట్టి పరిస్థితిని శాంతింపచేయాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. లోక్‌సభలో టిఎంసి, కాంగ్రెస్‌, రెండు సభల్లో డిఎంకె సభ్యులు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించారు. సభాపతులు షరామామూలుగా వాటిని తిరస్కరించినా ప్రతిపక్షసభ్యుల నినాదాలతో కార్యక్రమాలు ముందుకు సాగక సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. చివరకు సాయంత్రం 5 గంటలకు పునఃసమావేశమైన లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడకతప్పలేదు. జితేంద్రసింగ్‌ ప్రవేశపెట్టిన బిల్లుపై మంగళవారం చర్చ జరుగుతుంది.

విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో సిజెపి నాయకులు ఆందోళనను నిలుపుచేయటంతో, దాన్నుండి దృష్టిని, చర్చను మళ్లించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం చకచకా కొన్ని పైపూత చర్యలు ప్రకటించింది. నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో విద్యార్థుల మనసు గెలిచేందుకు ప్రధానమంత్రి స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వీడియోల పోస్టింగ్‌ దౌత్యం చేబట్టారు. లీకేజి నేరస్థులను జైల్లో బంధించామని, సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని ముందు ప్రకటించారు. అయినా విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై పట్టువీడకపోవటం, ఎన్ని ఆటంకాలు, నిర్బంధాలకు పాల్పడుతున్నా జంతర్‌మంతర్‌కు చేరుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక శక్తులు పెరుగుతుండటంతో శనివారం ప్రధాన్‌ చేత రాజీనామా చేయించారు.

అదే సమయంలో సిజెపి నాయకులతో చర్చలు కొనసాగించి వారి ఇతర కోర్కెలు – విద్యార్థి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విద్యార్థులపై క్రూరంగా దాడిచేసిన పోలీసులపై చర్య, దేశమంతటా విద్యార్థులపై కేసులు ఎత్తివేత – అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. తమకిచ్చిన హామీల అమలుకు విద్యార్థి నాయకులు ప్రభుత్వానికి నెలరోజులు గడువు విధించారు. జాతీయ పరీక్షల ఏజెన్సీని ప్రక్షాళన చేస్తున్నట్లు 47 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. పరీక్షల నిర్వహణను సంస్కరించి, సాంకేతికంగా పకడ్బందీ చేసేందుకు యుఐడిఎఐ మాజీ చైర్మన్‌ నందన్‌ నీలేకని నేతృత్వంలో ప్రధాని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించారు. దీన్ని దెబ్బతిన్న ప్రధాని ప్రతిష్ట పునరుద్ధరణ ప్రయత్నంగా కాంగ్రెస్‌ నేత జై రాం రమేష్‌ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎన్‌టిఎ సంస్కరణపై కె.రాధాకృష్ణన్‌ కమిటీ చేసిన 101 సిఫారసులను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కమిటీలు వారికి కాలయాపన, దృష్టి మళ్లింపు సాధనాలే. ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లును ‘బ్యాండ్‌ ఎయిడ్‌’గా అభివర్ణించిన రమేష్‌, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, విద్యావ్యవస్థలో సవాళ్లపై సమగ్ర బిల్లు తేవాలన్నారు. హోంమంత్రి సభకు వచ్చి ఢిల్లీలో పెల్లెట్‌ గన్స్‌, పట్నాలో ఎకె తుపాకీ ఉపయోగించటంపై వివరణ ఇవ్వాలని కె.సి.వేణుగోపాల్‌ కోరారు.

ఢిల్లీలో పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగించటాన్ని తొలుత తిరస్కరించిన పోలీసు అధికారులు, బాధితుణ్ణి ప్రతిపక్షం మీడియా ముందుకు తేవటంతో, ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్‌ ఉపయోగించినట్లు ధృవీకరించింది. ప్రజల ఆందోళనల సందర్భంగా నియంత్రించే చర్యలు స్టాండర్డ్‌ ప్రొసీజర్‌ ప్రకారం ఉండాలని ఆదేశించారు. కాని అతిక్రమించిన పోలీసులపై చర్యలు లేవు. ప్రభుత్వ వైఖరే అందుకు కారణమనవచ్చు. మహాశక్తిశాలిగా తనను తాను భావించుకుంటున్న, అటువంటి చిత్రాన్ని దేశం ముందుంచుతున్న మోదీ ప్రభుత్వం కాక్రోచ్‌ల ఆందోళనపై అపవాదులు కొనసాగిస్తూనే ఉంది. ఉద్యమం వెనుక విదేశీ శక్తులున్నాయని, దేశద్రోహులు అందులో చేరారని, పాతనేరస్థులు, సంఘ వ్యతిరేక శక్తులు అరాచకానికి పాల్పడ్డాయని ఢిల్లీనుంచి గల్లీదాకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు ఎత్తివేస్తామని ఢిల్లీలో అంగీకరించారు. కాని పట్నా, కలకత్తా తదితర నగరాల్లో కేసులు బనాయిస్తూనే ఉన్నారు. ఇదే బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ ద్వంద్వవైఖరి. విద్యార్థులపై కేసులు పెట్టటం వాగ్దాన ఉల్లంఘనగా సిజెపి నాయకులు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ, ఎటువైపునుంచీ హింసకు తావులేదని వ్యాఖ్యానించింది. పోలీసుల బలప్రయోగాన్ని తప్పుపట్టింది.

లీకేజి వ్యతిరేక బిల్లు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక కోర్టులు – ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వం పరువుతీసిన సిజెపి ఉద్యమం, ప్రతిపక్షాల ప్రతిఘటననుంచి తననుతాను కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న తాత్కాలిక చర్యలే. విద్యావ్యవస్థను కాషాయమయం చేస్తున్న విధానాలను సరిదిద్దుకోనంతవరకు ఈ సంక్షోభం ఏదోక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది.

ట్యాగ్‌లు: BJP CJP editorial political news