Skip to content
జాతీయం › వార్తలు

Supreme Court: అరెస్టు చేసిన 24 గంటల నిబంధనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే గడువు లెక్కింపు

jagan 05 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Supreme Court: అరెస్టు చేసిన 24 గంటల నిబంధనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే గడువు లెక్కింపు

Supreme Court: పోలీసులు అరెస్టు చేసే వ్యక్తుల ప్రాథమిక రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై భారత అత్యున్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన , చారిత్రాత్మకమైన వివరణ ఇచ్చింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలన్న రాజ్యాంగ నిబంధనను పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచి కాకుండా, వాస్తవంగా ఆ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించి భౌతికంగా నిర్బంధించిన క్షణం నుంచే లెక్కించాలని స్పష్టం చేసింది.

త్రిపురలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం (NDPS Act) కింద నమోదైన ఒక కేసులో బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టయిన వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సిందేనని తేల్చిచెప్పింది.

సోదాలు, తనిఖీలు , స్వాధీనం ప్రక్రియల పేరుతో గంటల తరబడి అదుపులో ఉంచుకుని, ఆ పనులన్నీ పూర్తయ్యాక పోలీసులు రికార్డుల్లో అధికారికంగా అరెస్టు చూపిన సమయం నుంచే 24 గంటల గడువు మొదలవుతుందనుకోవడం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవంగా అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ప్రయాణ సమయం మినహా 24 గంటలు దాటినా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోతే, ఆ నిర్బంధం చెల్లదని , సంబంధిత నిందితుడిని వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కేవలం 24 గంటల్లోగా కోర్టు ముందు నిలబెట్టినంత మాత్రాన ఆ నిర్బంధం చట్టబద్ధం అయిపోదని కోర్టు తెలిపింది. నూతన చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 58 ప్రకారం దర్యాప్తు సంస్థలు ప్రతి నిర్బంధ సమయాన్ని సహేతుకంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. నిందితుడిని పోలీసులు ప్రవేశపెట్టినప్పుడు అసలు ఏ తేదీన, ఏ సమయానికి అతడి స్వేచ్ఛను అడ్డుకుని నిర్బంధించారో ఆ వివరాలను మేజిస్ట్రేట్లు కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించింది. రాజ్యాంగపరమైన 24 గంటల పరిమితి దాటిందని భావిస్తే, తదుపరి పోలీస్ లేదా జ్యూడిషియల్ రిమాండ్‌కు అనుమతి నిరాకరించే సంపూర్ణ అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.