Skip to content
జాతీయం వార్తలు

దేశంలో 11 ఏళ్లలో 1.23 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య.. రోజుకు 40 మంది విద్యార్థులు బలి.. షాకిస్తున్న ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్.. చావులకు ప్రధాన కారణం ఏంటంటే..

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
దేశంలో 11 ఏళ్లలో 1.23 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య.. రోజుకు 40 మంది విద్యార్థులు బలి.. షాకిస్తున్న ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్.. చావులకు ప్రధాన కారణం ఏంటంటే..

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రొజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా దాదాపు 22 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఈ తీవ్రమైన సమస్య ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దశాబ్ద కాలపు నివేదికల విశ్లేషణ ప్రకారం.. 2014 నుండి 2024 మధ్యకాలంలో విద్యార్థుల బలవన్మరణాలు ఏకంగా 80 శాతం మేర పెరిగాయి. 2014లో 8,068గా ఉన్న ఆత్మహత్యల సంఖ్య.. 2024 నాటికి 14,488కి చేరింది. ఈ దశాబ్దకాలంలో మొత్తంగా 1,23,914 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యల్లో దాదాపు 21 శాతం (సుమారు 25 వేల కేసులు) కేవలం పరీక్షలకు సంబంధించిన భయాల వల్లే జరిగాయి. విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే కుటుంబ సమస్యలు, పరీక్షల భయం వాటా 33.5 శాతంగా ఉంది. అలాగే అనారోగ్యం వల్ల 17.9 శాతం, మత్తు పదార్థాల అలవాటు వల్ల 7.6 శాతం, నిరుద్యోగం వల్ల 1.5 శాతం మేర ఆత్మహత్యలు నమోదయ్యాయి.

వయస్సు రీత్యా చూస్తే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో 55 శాతం మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కాగా.. 42 శాతం మంది 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కులు. 2024లో బలవన్మరణానికి పాల్పడిన 14,488 మందిలో 7,669 మంది అబ్బాయిలు, 6,819 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ జాబితాలో మహారాష్ట్ర (1,917), ఉత్తరప్రదేశ్ (1,585), మధ్యప్రదేశ్ (1,447) రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (1,287) ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితులు పెరుగుతుండగా, 2024లో 700 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.

ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు 2020 జూలైలో కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్‌కు ఇప్పటివరకు ఏకంగా 3.32 లక్షల ఫోన్‌కాల్స్ రావడం విద్యార్థులలో ఉన్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి అద్దం పడుతోంది. ఏటా పెరుగుతున్న ఈ గణాంకాలు (2014లో 8,068 నుండి ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ 2024లో 14,488కి చేరుకోవడం) విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై తక్షణ చర్యల అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, వెంటనే నమ్మకమైన వ్యక్తి లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. అవసరమైతే Tele-MANAS: 14416 / 1-800-89-14416 ద్వారా ఉచిత సహాయం పొందండి.