Skip to content
తెలంగాణ వార్తలు

AV Ranganath: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించండి.. ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు..

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
AV Ranganath: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించండి.. ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు..

Telangana High Court and AV Ranganath

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదుల సంఖ్యలో కోర్టు ధిక్కారణ పిటిషన్లను ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగ్‌నాథ్‌ను హైడ్రా (HYDRAA) కమిషనర్‌ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (సిఎస్) ఆదేశించింది. ఆయన స్థానంలో మరో ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైదరాబాద్ నగరంలోని లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో లోతైన విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఆ వివాదాస్పద భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యం చేసుకోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అయితే లోతుకుంట సర్వే నంబర్ 1, 2 పరిధిలోని 40 ఎకరాల్లోకి హైడ్రా అధికారులు అసలు వెళ్లలేదని, పిటిషనరే కోర్టుకు అవాస్తవాలు తెలియజేశారని పేర్కొంటూ రంగనాథ్ కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా లోతుకుంట భూముల వ్యవహారంలో జరిగిన పరిణామాలకు సారీ చెబుతూ.. న్యాయస్థానానికి క్షమాపణలు తెలుపుతూ ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టుల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని ఈ సందర్భంగా రంగనాథ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ రంగనాథ్‌పై ఇప్పటికే ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది.

కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడం తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నందున ఆయనను ఆ కీలక పదవిలో కొనసాగించడం సరికాదని భావించిన హైకోర్టు.. రంగ్‌నాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది.