ఉపరితల ఆవర్తనం ప్రభావం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
Rain Fury Hits Hyderabad,Several Telangana Districts Under Yellow Alert as Heavy Rain Continues
దక్షిణ కోస్తాంధ్ర ,దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం నాడు అన్నమయ్య జిల్లా కలికిరిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, నిమ్మనపల్లె, పలమనేరు, కార్వేటినగరం వంటి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం శనివారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ,రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అయితే, ఒకవైపు వర్షాలు కురుస్తున్నా, మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. శుక్రవారం ప్రకాశం జిల్లా కారేడులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 43 డిగ్రీలు, మన్యం జిల్లా భామినిలో 41.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తిరుపతి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్దిరోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న తిరుపతి వాసులకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ, ఎండ వేడి నుంచి ఉపశమనం లభించడంతో స్థానికులు కొంత ఊరట చెందారు.