Skip to content
ప్రపంచం వార్తలు

China Artificial Sun: టెక్నాలజీతో సూర్యుడిని కూడా వదలని చైనా .. కృత్రిమ సూర్యుడి కోసం 582 టన్నుల ప్రపంచంలోనే అతిపెద్ద అయస్కాంతం..

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
China Artificial Sun: టెక్నాలజీతో సూర్యుడిని కూడా వదలని చైనా .. కృత్రిమ సూర్యుడి కోసం 582 టన్నుల ప్రపంచంలోనే అతిపెద్ద అయస్కాంతం..

China Artificial Sun (Photo: X/@STANLEES4)

China Artificial Sun: అణు సంలీనం (Nuclear Fusion) ద్వారా స్వచ్ఛమైన, దాదాపు అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేసే దిశగా చైనా ఒక సంచలనాత్మక మైలురాయిని అధిగమించింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన టోరాయిడల్ ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసి పరీక్షించారు. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 582 టన్నుల బరువు కలిగిన ఈ D ఆకారపు నిర్మాణం.. అంతర్జాతీయ ఫ్యూజన్ ప్రాజెక్ట్ (ITER) లోని అయస్కాంతాల కంటే 1.3 రెట్లు పెద్దదిగా.. మూడు రెట్లు ఎక్కువ నిల్వ శక్తిని కలిగి ఉంది.

కృత్రిమ సూర్యుడు అనేది సూర్యుడిలో శక్తి ఉత్పత్తయ్యే ప్రక్రియనే భూమిపై పునఃసృష్టించే ఒక అణు సంలీన రియాక్టర్. ఇది దాదాపు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ అతి తీవ్రమైన ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్ అణువులను సంలీనం చేస్తూ.. కార్బన్ ఉద్గారాలు లేకుండా అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో రియాక్టర్ గోడలు కరిగిపోకుండా.. అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను మధ్యలోనే బంధించి ఉంచడానికి ఈ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతం అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. దీనితో పాటు ఫ్యూజన్ రియాక్టర్‌కు గుండె లాంటి సెంట్రల్ సోలెనాయిడ్ కాయిల్ ను కూడా చైనా నిపుణులు విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా 47 పేటెంట్లు, 25 పరిశ్రమ ప్రమాణాలను సాధించి.. విదేశీ సాంకేతికతపై ఆధారపడటానికి తెరదించింది.

ఈ రకమైన అయస్కాంతాన్ని రూపొందించడం ఇంజనీరింగ్ పరంగా అతిపెద్ద సవాలు. ఇది మైనస్ 269°C అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద.. 100,000 ఆంపియర్లకు పైగా ఉధృతమైన విద్యుత్‌ను శక్తి నష్టం లేకుండా మోస్తూ.. తీవ్రమైన రేడియేషన్‌ను తట్టుకుని 60 ఏళ్ల పాటు సజావుగా పనిచేసేలా తీర్చిదిద్దారు. గతంలో చైనాకు చెందిన ఈస్ట్ టోకామాక్ రియాక్టర్ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 1,066 సెకన్ల పాటు ప్లాస్మాను నిలిపివుంచి ప్రపంచ రికార్డు సృష్టించింది.

చైనా తన రోడ్‌మ్యాప్‌లో భాగంగా 2027 నాటికి బర్నింగ్ ప్లాస్మా రియాక్టర్‌ను పూర్తి చేసి.. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి రియాక్టర్ అసెంబ్లీ.. నిరంతర విద్యుత్ ఉత్పాదన వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ.. ఈ విజయం చైనాను ప్రపంచ ఇంధన విప్లవంలో అగ్రగామిగా నిలబెడుతోంది.

ట్యాగ్‌లు: artificial Sun fusion energy