Skip to content
ప్రపంచం వార్తలు

భారత నౌకలపై దాడికి ఇరాన్ కారణమంటూ ట్రంప్ ఆరోపణలు.. అమెరికా అధినేత వ్యాఖ్యలను ఖండించిన టెహ్రాన్..

Prajapaksham 13 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
భారత నౌకలపై దాడికి ఇరాన్ కారణమంటూ ట్రంప్ ఆరోపణలు.. అమెరికా అధినేత వ్యాఖ్యలను ఖండించిన టెహ్రాన్..

Trump Warns of Bombing if Iran Peace Deal Fails

ఒమన్‌ తీరంలో భారతీయ నావికులున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా, దేశీయంగా తీవ్ర దౌత్య, రాజకీయ వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా ఈ దాడులకు బాధ్యులెవరనే అంశంపై అమెరికా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. అమెరికా సైనిక విభాగమైన సెంట్రల్ కమాండ్ (CENTCOM) తామే ఈ దాడులు చేశామని స్పష్టంగా అంగీకరించినప్పటికీ.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న భారత నౌకలపై ఇరానే డ్రోన్లతో దాడులు చేసిందని.. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు వాణిజ్య నౌకలపై జరిగిన ఈ ప్రాణాంతక దాడులను, ముగ్గురు భారతీయ నావికుల మరణాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం మరోసారి పిలిపించుకొని తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య భద్రత, స్థిరత్వానికి అమెరికా దాడులు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ ఆందోళనలను అమెరికా ఉన్నత నాయకత్వానికి చేరవేయాలని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి కూడా సమన్లు అందుకున్న జేసన్ మీక్స్‌కు.. భవిష్యత్తులో ప్రాణనష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని భారత్ గట్టిగా సూచించింది.

ఈ దాడులపై ఇరాన్, ఐక్యరాజ్యసమితి (UN) కూడా గట్టిగా స్పందించాయి. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ దాడులు అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు. అమాయక భారతీయ నావికుల మరణానికి అమెరికానే పూర్తి జవాబుదారీగా చేయాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

ఈ దౌత్య వివాదం దేశీయంగానూ రాజకీయ సెగలు రేపుతోంది. ఒమన్ తీరంలో అమెరికా దాడుల కారణంగా భరతమాత బిడ్డలు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ ఒక రాజీపడ్డ ప్రధాని అని, ఆయన దేశ పౌరులను రక్షించలేకపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు అమెరికా సైన్యం దాడులను ఒప్పుకోవడం, మరోవైపు అధ్యక్షుడేమో ఇరాన్‌పై నిందలు వేయడం చూస్తుంటే ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారుతోందని స్పష్టమవుతోంది.