ఇండియా కూటమి పునరుజ్జీవం
Opposition Unity Returns: INDIA Alliance Revival Gains Momentum
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు, బిజెపిని ఓడించే ఏకైక ప్రయోజనంతో ఏర్పడిన ప్రతిపక్షపార్టీల కూటమి ‘ఇండియన్‌నేషనల్‌డెవలప్‌మెంటల్‌ఇన్‌క్లూజివ్‌అలయెన్స్’ (సంక్షిప్తంగా ‘ఇండియా’ కూటమి) ఆ ఎన్నికల్లో లక్ష్యాన్ని సాధించలేకపోయినా బిజెపిని మైనారిటీలో (543 లోక్‌సభ సీట్లలో 240) పడేసింది. అయితే ఆ తదుపరి ప్రధానంగా పార్లమెంటులో సమస్యలకే పరిమితమైంది. అదొక ఫ్రంట్‌కాదు. బోలు కూటమి. వ్యవస్థాగత నిర్మాణం లేదు. సమష్టి లేదా వ్యష్టి నాయకత్వం లేదు. కాంగ్రెస్‌దేశవ్యాప్త అస్తిత్వం ఉన్న పార్టీ, పార్లమెంటులో ప్రతిపక్షంలో పెద్ద పార్టీ అయినందున అది కూటమి నాయకురాలు అనుకోవటం తప్ప అది వాస్తవం కాదు. అంతేగాక కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, కూటమి భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు మధ్య వైరుధ్యం, ఘర్షణ ఉంది. రాష్ట్రంలో తమది పెద్ద పార్టీ అనే పేరుతో కాంగ్రెస్‌ను తక్కువచేసి తమ ఆధిక్యతను స్థిరపరుచుకునేందుకు కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రయత్నం కూడా కాంగ్రెస్‌తో ఘర్షణకు హేతువైంది. వామపక్షాలను అణచివేసే ధోరణి అన్ని పార్టీల్లోనూ ఉంది. అందువల్ల అదొక కలగూరగంపగా కనిపిస్తుంది. ఆ విధంగానే బిజెపి అవహేళన చేస్తూ తాను లబ్దిపొందటానికి ప్రయత్నిస్తుంటుంది.
‘ఇండియా’ కూటమి గత రెండు సంవత్సరాల్లో కేవలం పార్లమెంటరీ సమన్వయ కూటమిగానే పనిచేసింది. ఈ కాలంలో జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భాగస్వాములది దాదాపు ఒంటరి పోరాటమే. తమిళనాడు మినహా బిజెపిదే పైచేయి అయింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే డిఎంకె కూటమిలోని కాంగ్రెస్ మర్యాదకోసమైనా తమతో చెప్పకుండా ఆ పార్టీ ప్రభుత్వంలో చేరటాన్ని ‘ద్రోహం’గా పరిగణించిన డిఎంకె ఇండియా కూటమినుంచి వైదొలిగింది. తనకు ఎదురులేదనుకున్న మమతా బెనర్జీ నుంచి పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని బిజెపి గుంజుకుంది. కొద్ది రోజులకే టిఎంసి ముక్కచెక్కలైంది. 80మంది ఎమ్మెల్యేల్లో 58మంది తిరుగుబాటుచేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని స్థానం పొందారు. తాజాగా, 28మంది లోక్‌సభ సభ్యుల్లో 20మంది ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఎన్‌డిఎను బలపరుస్తున్నారు. రాజ్యసభ సభ్యులిరువురు ఇప్పటికే పార్టీకి, సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక జిల్లాల్లో పోలీసుల వేధింపులు, కేసులు, బిజెపివారి దాడులు తదితర కారణాలతో ఎందరో పార్టీని వీడుతున్నారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తదుపరి పెద్ద పార్టీలైన డిఎంకె, తృణమూల్‌కాంగ్రెస్‌లు ఎన్నికల్లో ఓడిపోవటంతో ఇక తమ బాట రహదారి అనే రీతిలో బిజెపి ఖుషీ అవుతున్న దశలో , తమలోని నిస్తేజాన్ని, అనైక్యతను వదిలించుకుని ఒక్కటిగా వ్యవహరించాలన్న జాగరూకత ఇండియా కూటమి భాగస్వాముల్లో మేల్కొంది. దాని పర్యవసానమే ఈనెల 8వ తేదీన ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశం. సమావేశానికి ముందు కాంగ్రెస్‌పై కొన్ని విమర్శలు వినిపించినా కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు ప్రాతినిధ్యం కలిగిన 23 పార్టీలు హాజరుకావటం విశేషం. కూటమినుంచి స్థానిక రాజకీయ వైరుధ్యాలతో వైదొలిగిన ఆప్, డిఎంకె హాజరు కాకపోయినా, ప్రజా సమస్యలపై పార్లమెంటులో మిగతా పార్టీలతో సమన్వయం చేసుకుంటామని చెప్పటం శుభసూచకం.
ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని ఢిల్లీ సమావేశం నిర్ణయించటం కూటమిని క్రియాశీల మొనర్చుతుంది. భిన్నాభిప్రాయాలను అరమరికలు లేకుండా ఎప్పటికప్పుడు చర్చించుకునే అవకాశం కలుగు తుంది. అట్టి తొలి సమావేశం ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్‌లో జరుగుతుంది. ఏకీకృత కార్యాచరణ నిమిత్తం ఐదు అంశాలను నిర్ణయించినట్లు న్యూఢిల్లీ సమావేశానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్‌అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఒకటి, ఓటర్ల జాబితాల సవరణలో అవకతవకలు (ఎస్‌ఐఆర్), ‘ఓటు చోరీ’పై తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖరాయటం (తాజాగా, మీనాక్షి నటరాజన్‌రాజ్యసభ నామినేషన్‌తిరస్కరణతో సీట్‌చోరీ తోడైంది). రెండు, నీట్, సిబిఎస్‌ఇ పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహించి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామాను డిమాండ్‌చేస్తూ తీర్మానం. ఇదే డిమాండ్‌తో కాక్రోచ్‌జనతాపార్టీ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నది. మూడు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయరంగం దుస్థితి సహా దేశంలోని ప్రస్తుత క్లిష్ట ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి. నాలుగు, రెండు నెలలకొకసారి కూటమి సమన్వయ సమావేశాలు. ఐదు, పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు కూటమి భాగస్వాముల రోజువారీ సమన్వయ సమావేశాల నిర్వహణ.
మోదీ ప్రభుత్వం డిఎంకె ఇండియా కూటమికి దూరం కావటం, టిఎంసి ఎంపిల్లో భారీ చీలిక, ఆప్‌రాజ్యసభ ఎంపిలు అరడజనుమంది బిజెపిలో చేరటం వంటి పరిణామాలతో ఉత్సాహం పొంది, పార్లమెంటులో ఓడిపోయిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌అమలు లింక్‌బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాలని, ఒక దేశం ఒకే ఎన్నికలు బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ఆయిలు, గ్యాస్‌ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే, వాటినుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం ఇతరేతర అంశాలను ప్రచారంలో పెడుతున్నది. ప్రభుత్వ వైఫల్యాలపై ఏకోన్ముఖ పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేసేందుకు ఇండియా కూటమి నడుం కట్టటం ఆహ్వానించదగింది. ఒకరిద్దరు కన్వీనర్‌లతో కొద్దిమందితో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు కూటమిని ఒక సంస్థగా క్రియాశీల మొనర్చుతుంది.