US దాడులకు ప్రతీకారం.. హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. ప్రపంచ చమురు సరఫరాకు బిగ్ షాక్..
Strait of Hormuz Closed: Iran Responds to U.S. Military Attacks
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అధునాతన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్‌తో కూల్చివేసిన ఘటనతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. ఈ చర్యకు ప్రతిస్పందనగా అమెరికా వైమానిక దాడులు చేయగా, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. దీంతో అమెరికా సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తున్నందున, తమ రక్షణ కోసమే ఈ దాడులు చేపట్టాల్సి వచ్చిందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ బెదిరింపులను లెక్కచేయకుండా తాము హొర్ముజ్ జలసంధి ద్వారా 200 నౌకల్లో సుమారు 10 కోట్ల బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించామని ఆయన వెల్లడించారు. అయితే అమెరికా దాడుల నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ హెచ్చరికలను పక్కనపెట్టి ఏ నౌకైనా హొర్ముజ్‌ను దాటడానికి ప్రయత్నిస్తే తీవ్ర దాడులు తప్పవని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
మరోవైపు ఇరాన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ దాడులు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దీనికి బదులుగా ఈసారి ఇరాన్‌లోని కీలక విద్యుత్తు ప్లాంట్లు, వంతెనలు , మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని వైమానిక దళాన్ని ఆదేశించనున్నట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దౌత్యపరమైన చర్చల ప్రయత్నాలు పూర్తిగా నిలిచిపోతే సైనిక చర్యలు మరింత దారుణంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పాలకులకు బతికి బట్టకట్టే ఉద్దేశం ఉంటే, తాము ప్రతిపాదించిన ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ తాజా ప్రకటనలతో పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.