Skip to content
ప్రపంచం వార్తలు

US Water Crisis: అమెరికాలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం.. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కార్పస్ క్రిస్టీ నగరం.. ప్రపంచ దేశాలకు గట్టి వార్నింగ్..

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Water Crisis: అమెరికాలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం.. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కార్పస్ క్రిస్టీ నగరం.. ప్రపంచ దేశాలకు గట్టి వార్నింగ్..

Drought and Trump

US Water Crisis: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో నీటి సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రముఖ తీర ప్రాంత నగరం కార్పస్ క్రిస్టీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. సుమారు మూడు లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరం.. ఆధునిక అమెరికా చరిత్రలోనే పూర్తిగా నీటి నిల్వలు కోల్పోయే తొలి నగరంగా మారే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక కరువు, పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక రంగం నుంచి పెరిగిన నీటి వినియోగం, ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధిలో జాప్యం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి.

గత కొన్ని సంవత్సరాలుగా టెక్సాస్‌లో వర్షపాతం గణనీయంగా తగ్గడంతో కార్పస్ క్రిస్టీకి తాగునీరు అందించే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు.. ఆవిరైపోయే నీటి పరిమాణం పెరగడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రస్తుతం నగరంలో ఉన్న నీటి నిల్వలు కేవలం మరో ఏడాది అవసరాలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

నీటి కొరతకు మరో ప్రధాన కారణం వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం. ముఖ్యంగా పెట్రోకెమికల్, రసాయన పరిశ్రమలు భారీ మొత్తంలో నీటిని వినియోగిస్తున్నాయి. 2022లో ప్రారంభమైన ఒక భారీ ప్లాస్టిక్ కెమికల్ ప్లాంట్ ఒక్క రోజులో వినియోగించే నీటి పరిమాణం, నగర ప్రజలందరూ ఒక రోజులో ఉపయోగించే నీటితో సమానంగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రజలకు అందాల్సిన నీటి వనరులపై మరింత ఒత్తిడి పెరిగింది.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ, భారీ వ్యయం, అనుమతుల జాప్యం, స్థానిక ప్రజల అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఈ ప్లాంట్ పూర్తయితే రోజుకు వందల మిలియన్ల లీటర్ల తాగునీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీనికి బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే పరిస్థితి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్ జర్నలిస్ట్ డైలాన్ బద్దూర్ ప్రకారం.. అమెరికాలో పూర్తిగా నీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదానికి అత్యంత దగ్గరగా ఉన్న నగరం ప్రస్తుతం కార్పస్ క్రిస్టీనే. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు లోతైన భూగర్భ బావుల తవ్వకం, మురుగునీటి శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు తిరిగి వినియోగించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు.

ఇప్పటికే నగరంలో నీటి వినియోగంపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇళ్ల తోటలకు నీరు పోయడం, వాహనాలను కడగడం వంటి కార్యకలాపాలపై పరిమితులు విధించారు. పరిస్థితి మరింత విషమిస్తే దశలవారీగా నీటి సరఫరాను తగ్గించడం లేదా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే తాగునీరు అందించే చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కార్పస్ క్రిస్టీ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నీటి సంక్షోభానికి హెచ్చరికగా నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విస్తరణ నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు సమిష్టిగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని నగరాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.