Skip to content
ప్రపంచం వార్తలు

US Iran Tensions: అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తాం.. తీవ్ర హెచ్చరికలు చేసిన ఇరాన్..పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Iran Tensions: అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తాం.. తీవ్ర హెచ్చరికలు చేసిన ఇరాన్..పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు

Ayatollah Ali Khamenei

US Iran Tensions: పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా- ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు, తీవ్రమైన వ్యాఖ్యలతో ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్ ఇకపై ఏదైనా వాణిజ్య లేదా సైనిక నౌకపై దాడికి పాల్పడితే.. ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

అయితే అమెరికా హెచ్చరికలపై ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అమెరికాపై గతంలో జరిగిన 9/11 ఉగ్ర దాడి తరహాలోనే మరోసారి విరుచుకుపడతామని బెదిరించింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అమెరికా మరోసారి జాతీయ సంతాప దినాలు పాటించాల్సి వస్తుందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ ‘తస్నిమ్’ ద్వారా హెచ్చరికలు పంపింది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబరు 11న జరిగిన ఉగ్రవాద దాడి అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనది. నాడు అల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి.. ట్విన్ టవర్స్ భవంతులను ఢీకొట్టి భారీ మారణహోమానికి ఒడిగట్టారు. ఈ దాడిలో 2,996 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 వేల మందికి పైగా పౌరులు గాయపడ్డారు. ఆ సమయంలో అమెరికా ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఇప్పుడు అదే ఘోరకలిని గుర్తుచేస్తూ ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

అమెరికా బలగాలు హార్ముజ్ జలసంధికి దూరంగా ఉంటేనే ఆ ప్రాంతం భద్రంగా ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. తమ దేశం చమురును విక్రయించకుండా అడ్డుకుంటే.. ప్రపంచంలో మరికే దేశం కూడా చమురును అమ్మకుండా చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. హార్ముజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలపై ఇరాన్ విరుచుకుపడటంతో మొదలైన ఈ పోరు పన్నెండు రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు టెహ్రాన్ సైనిక స్థావరాలను.. క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు విస్తృతమైన దాడులు నిర్వహించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.

పశ్చిమాసియా సంక్షోభం మరింత ఆందోళనకరంగా మారుతూ.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన ‘బాబ్‌ ఎల్‌-మాండెబ్‌’ జలసంధిని మూసివేస్తున్నట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ అరేబియాకు చెందిన నౌకల రాకపోకలను అడ్డుకుంటామని స్పష్టం చేసిన హూతీలు.. దానికి అనుగుణంగానే సౌదీకి చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై దాడులు జరిపినట్లు తాజాగా వెల్లడించారు. ఈ వరుస పరిణామాలు అంతర్జాతీయంగా చమురు సరఫరాను దెబ్బతీసి గ్లోబల్ మార్కెట్‌లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.