Skip to content
ప్రపంచం వార్తలు

ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..

Prajapaksham 11 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..

Trump Faces Major Setback as US House Votes to Curb Iran War Powers

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఇరాన్‌పై అమెరికా సైన్యం భారీస్థాయిలో దాడులకు తెగబడింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ దాడుల్లో అమెరికా దాదాపు 49 తోమహాక్ క్షిపణులను ఉపయోగించడంతో పాటు ఫైటర్ జెట్ల ద్వారా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా టెహ్రాన్‌కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని స్థావరాలతో పాటు మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి ఇరాన్ దక్షిణ ప్రాంతాలపై అమెరికా సేనలు విరుచుకుపడ్డాయి. చర్చలు లేదా కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు తమను ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ ఆ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేసింది.

అమెరికా జరిపిన ఈ దాడులపై ఇరాన్ కూడా అంతే దీటుగా ప్రతిస్పందించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని చమురు ట్యాంకర్లతో సహా అన్ని రకాల నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించాయనే నెపంతో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు రెండు చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. అంతేకాకుండా, పొరుగు దేశాలైన కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.

బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళం (5th Fleet) ప్రధాన కార్యాలయమైన షేక్ ఇసా ఎయిర్‌బేస్‌పై, అలాగే కువైట్‌లోని అలీ అల్ సలీమ్ ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ డ్రోన్లు , క్షిపణులతో ప్రతిదాడులు చేపట్టింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రస్తుతానికి ఈ విడత దాడులు ముగిశాయని ప్రకటించినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *