విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షాల హెచ్చరిక
Rains News
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు ,పిడుగులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి ప్రారంభమై గురువారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ అకాల వర్షం కారణంగా విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, అలాగే కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో కూడిన తుపాను తరహా వాతావరణం నెలకొనడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోవైపు, రాష్ట్రంలో రాగల కొన్ని రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల ఉధృతి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ,తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వీటితో పాటు తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా రాబోయే గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇళ్ల నుండి బయటకు రాకూడదని యంత్రాంగం పటిష్ట హెచ్చరికలు జారీ చేసింది.