ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ
US Attack on Commercial Vessel Off Oman Leaves 3 Indians Dead
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో వాణిజ్య నౌకపై అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారు. గత వారం జరిగిన ఈ ఘటనలో తొలుత వారు గల్లంతైనట్లు భావించినప్పటికీ, తాజాగా వారి మృతదేహాలను గుర్తించినట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారికంగా ప్రకటించారు. మరణించిన వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాలా సురేశ్‌గా గుర్తించారు.
మొత్తం 28 మంది సిబ్బంది ఉన్న ‘ఎంటీ సిట్టిబెల్లో’ (MT Settebello) అనే ఈ వాణిజ్య నౌకలో 24 మంది భారతీయులతో పాటు ఇద్దరు పాకిస్తానీలు, ఒక ఉక్రెయిన్ , ఒక రష్యా పౌరుడు ఉన్నారు. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలు, ఆదేశాలను ఉల్లంఘించి ఇరాన్ నుండి ఇంధనాన్ని తరలిస్తోందనే ఆరోపణలతో… అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఒమన్ తీరంలో ఈ నౌక ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని ‘ప్రిసిషన్ మునిషన్’ బాంబులతో దాడి చేశాయి. హోర్ముజ్ జలసంధిని దాటుతున్న సమయంలో ఈ భీకర దాడి జరిగింది.
ఈ ఘటనను భారతదేశం ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా తీవ్రంగా ఖండించింది. మెజారిటీ భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా నేవీ దాడి చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రతిభావంతులైన నావికులను కోల్పోవడం భారత నౌకాదళ రంగానికి తీరని లోటని మంత్రి సోనోవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన నావికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు, వారి భౌతిక కాయాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.