Skip to content
జాతీయం వార్తలు

అభిషేక్ కావాలా?.. నేను కావాలా..మమతా బెనర్జీకి షాకిస్తూ క‌ళ్యాణ్ బెన‌ర్జీ అల్టిమేటం

Prajapaksham 11 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అభిషేక్ కావాలా?.. నేను కావాలా..మమతా బెనర్జీకి షాకిస్తూ క‌ళ్యాణ్ బెన‌ర్జీ అల్టిమేటం

Political Storm in TMC Over Kalyan Banerjee's ‘Choose Abhishek or Me’ Comment

పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కల్యాణ్ బెనర్జీ బహిరంగంగానే అల్టిమేటం జారీ చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తనలాంటి సీనియర్ నాయకులు కావాలో లేక ఆమె మేనల్లుడు, పార్టీ నెంబర్ టూ అభిషేక్ బెనర్జీ కావాలో మమతనే తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తాను ఎప్పటికీ మమతా బెనర్జీ వైపే ఉంటానని స్పష్టం చేస్తూనే… అసలు దీదీ అభిషేక్ పక్షాన ఉందా లేక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందా అన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటం, కొందరు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడటంతో నెలకొన్న రాజకీయ ముసలం ఈ పరిణామంతో మరింత ముదిరింది.

ఈ అంతర్గత పోరుకు అభిషేక్ బెనర్జీకి సంబంధించిన ఒక ఫోర్జరీ కేసు ప్రధాన కారణమైంది. బెంగాల్ సీఐడీ (CID) సమన్లు జారీ చేసిన ఈ ఫోర్జరీ కేసులో కల్యాణ్ బెనర్జీ కలగజేసుకుని, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చంద్ ధర్మాసనం ముందు ఆ కేసును త్వరగా విచారణకు తీసుకురావాలని కోరారు. అయితే, సీనియర్ అయిన తనను సంప్రదించకుండానే అభిషేక్ బెనర్జీ మరో జూనియర్ లాయర్ అయాన్ భట్టాచార్యను ఈ కేసు కోసం నియమించుకున్నారు.

ఈ ఉదంతంలో అభిషేక్ బెనర్జీ తన పట్ల తీవ్ర అమర్యాదగా ప్రవర్తించారని కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనకంటే చిన్నవారేననే అహంకారం, విపరీతమైన దూకుడు అభిషేక్ బెనర్జీలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఈ అవమానం కారణంగానే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అభిషేక్ బెనర్జీ తరఫున తాను ఎలాంటి న్యాయపరమైన అంశాల్లోనూ వాదించబోనని కల్యాణ్ బెనర్జీ తెగేసి చెప్పారు. సీనియర్ల ఆత్మగౌరవానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ టీఎంసీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *