Skip to content
సంపాదకీయం వార్తలు

ప్రధానిగా మోదీ పుష్కర కాలం

Prajapaksham 10 Jun 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
ప్రధానిగా మోదీ పుష్కర కాలం

Modi at 12: Transforming India's Political Landscape

జూన్ 10, 2026కు చరిత్రలో ఏదైనా ప్రాముఖ్యత ఉందా? అంటే ఉందని అంటున్నారు కమలనాధులు, అవునని గొంతుకలు కలుపుతున్నారు ఎన్ భాగస్వాములు. ఏమిటి ఆ ప్రాముఖ్యత? ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ మోదీ ప్రధానమంత్రిగా ఈ రోజున 4399 రోజులు పదవీకాలం పూర్తిచేసి నవభారత ప్రధాని పండిత జవహర్ నెహ్రూ ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన’ పదవీకాలాన్ని అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్ వెలుపల అత్యధికకాలం ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి నరేంద్రమోదీ. సంతోషం. బిజెపివారు ఈ సందర్భాన్ని పండుగ చేసుకోవటం సబబే. అయితే ఒక వాస్తవం దాచిపెడుతున్నారు. పండిత నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజునుండీ మే 27,1964న తుదిశ్వాస విడిచే వరకు మొత్తం 16 సంవత్సరాల 286రోజులు ప్రధానిగా ఈ దేశానికి సేవలందించారు. కాని రాజ్యాంగం ప్రకారం తొలి సార్వత్రిక ఎన్నికల తదుపరి మే 13,1952 నుంచే నెహ్రూ పదవీకాలాన్ని లెక్కించి ఆ 4398 రోజులను మోదీ అధిగమించటాన్ని సరికొత్త రికార్డుగా ప్రచారం చేసుకుంటున్నారు.
సంఖ్యలు కాలాలు పోలికలకు మాత్రమే పరిమితం. కాని వ్యక్తిత్వాలు, జీవిత సాఫల్యాలు శాశ్వతాలు. పండిత్ నెహ్రూ జాతీయోద్యమ అగ్రనాయకుల్లో ఒకరు. వారి కుటుంబం జాతీయోద్యమానికి అపారంగా తోడ్పడింది, అసమాన త్యాగాలు చేసింది. ఈ దేశ రాజ్యాంగ రచనపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జవహర్ విశాల దృక్పథం, అంతర్జాతీయ అవగాహన, లౌకికత ముద్ర ఉంది. అత్యంత వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న నాటి భారతదేశం అభివృద్ధికి ప్రణాళికావిధానాన్ని, ప్రభుత్వరంగం పునాదిని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను, అలీన విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టిన క్రాంతదర్శి నెహ్రూ. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. అమెరికారష్యా నాయకత్వాల్లో రెండు శిబిరాలుగా విభజించబడిన ప్రపంచంలో ఆ రెండింటికీ మధ్యేమార్గంగా మార్షల్ టిటో (యుగొస్లావియా) అబ్దుల్ గమాల్ నాజర్(ఈజిస్టు)లతో కలిసి అలీన కూటమిని ఏర్పాటు చేసి సామ్రాజ్యవాద దురాక్రమణ, దోపిడీకి వ్యతిరేకంగా నవ స్వతంత్ర రాజ్యాల సార్వభౌమత్వ పరిరక్షణకు, ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. ఈ కృషిలో సోవియట్ యూనియన్ అలీనోద్యమానికి అండదండలు అందించింది. ఆ విధంగా నెహ్రూ దేశ స్వతంత్ర అభివృద్ధికి బలమైన పునాదులు నిర్మించారు. మత సామరస్యం కోసం పాటుపడ్డారు. గ్లోబల్ సౌత్ నాయకునిగా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. నెహ్రూ నిర్మించిన పునాదులపై తదుపరి ప్రధానులు ముఖ్యంగా ఇందిరాగాంధి దేశ పారిశ్రామికాభివృద్ధికి, అక్షరాస్యతకు, ఉపాధి కల్పనకు, పెట్టుబడిదారీ విధానం చట్రంలోనే కృషి చేశారు. కాగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, జాతీయోద్యమంలో పాత్ర లేకపోగా బ్రిటీష్ వలస పాలకులను బలపరిచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ శిక్షణలో ఎదిగిన స్వయం సేవక్. దాని హిందూ జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి. ఆర్ గృహం నుంచి బిజెపికి పంపబడిన నాయకుడు. అక్టోబర్ 7, 2001న నేరుగా గుజరాత్ ముఖమంత్రిగా ప్రజాస్వామిక రాజకీయ జీవితంలో అడుగుపెట్టారు. ఆ కాలంలో గోద్రాలో అయోధ్య కార్ రైలు బోగీల దగ్ధం, అనంతరం హిందూత్వ శక్తులు రెచ్చిపోయి ముస్లింలపై సాగించిన మారణకాండ, మోదీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వగైరా మోదీ రాజకీయ జీవితంలో చెరిగిపోని మచ్చలుగా కొనసాగుతూనే ఉంటాయి. ప్రధాని వాజ్ ఆయనకు రాజ్యధర్మం గుర్తుచేయటం, మోదీని అవాంఛనీయ వ్యక్తిగా పరిగణించి అమెరికా వీసా నిరాకరించటం గుర్తు చేసుకోదగినవి. ఆయన ప్రధానమంత్రి అయినాకగాని అమెరికా వీసా పునరుద్ధరించలేదు. ఎల్.కె.అద్వానీని ప్రధాని పదవికి పోటీనుంచి తప్పించేందుకు ఆర్ 75 ఏళ్ల వయోపరిమితిని ప్రకటించి మోదీని అందులో ప్రవేశపెట్టింది. అయితే మోదీ, ఆర్ అధినేత భాగవత్ గత సంవత్సరంలో 75 ఏళ్ల వయోపరిమితి దాటినా ఆ రూలును చాపకిందకు నెట్టేశారు.
నరేంద్రమోదీ వాగాడంబరి; ఆకర్షవంతంగా నినాదాలు కూర్చటంలో దిట్ట. హిందూత్వ ఎజండా అమలు, ఎన్నికల్లో విజయాలు సాధించటం ద్వారా బిజెపి విస్తరణ మోదీకి అప్పగించబడిన బాధ్యతలు. ఈ ఎజండా విజయవంతంగా అమలు జరగాలంటే ప్రజల మనస్సులనుంచి నెహ్రూ ప్రభావాన్ని తొలగించాలి. అందుకే నెహ్రూపై నిరంతరం దాడి, ఆయనకు పోటీగా సర్దార్ వల్లభ్ భాయిపటేల్ ఆకాశానికెత్తటం. ఈ రాజకీయ ఎజండాకు అనుగుణంగా ముస్లిం మైనారిటీలను నిరంతరం బూచిగా చిత్రిస్తూ హిందువులను ఏకం చేయటం కోసం తీవ్ర ప్రయత్నం అందుకోసం రామాలయం, కాశీ, చార్ ధాం, సోమనాధ్ తదితర హిందూ పవిత్ర ప్రదేశాలను ఉపయోగించుకుంటున్నారు.
మోదీ ప్రధాని పదవిలోకి వచ్చిన సమయం ఆయనకు కలిసివచ్చింది. 1991 నుంచి ప్రభుత్వాలు అమలు జరిపిన నయా ఉదార విధానాలు శ్రమజీవులను అణచివేస్తూ సంపద పెరుగుదలకు దారితీశాయి. అదే సమయంలో టెక్నాలజీ వృద్ధి చెందింది. వీటిని ఉపయోగించుకున్న పెట్టుబడిదారీవర్గం ప్రభుత్వంనుంచి ప్రయోజనం పొందుతూ ఉత్పత్తులను, మౌలిక వసతులను విస్తరించాయి. ఈ క్రమంలో దాదాపు, రూ.16లక్షల కోట్లు మొండి బాకీలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ముఖేష్ అంబానీ, గౌతం అదానీ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ప్రభుత్వం ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి పుష్కలంగా నిధులు రాబట్టింది. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అవినీతి ముద్ర వేశారు. రెండోవైపున ఆర్థిక వ్యవస్థ సరళీకరణను ఉపయోగించి, ఆదాయానికి పదుల లక్షల కోట్ల అప్పు లు జోడించి సౌకర్యాలను విస్తరించి అదే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయినా బిజెపి విధానాలతో విసుగు చెందిన దేశ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్ 400 స్థానాలు కోరిన బిజెపిని 240 కి పరిమితం చేశారు. తెలుగుదేశం, జెడి(యు) తదితర పార్టీల మద్దతుతో మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయినారు. అప్పటినుంచి ఏకపక్ష ఆధిక్యతకోసం మోదీ, బిజెపి కసికొద్ది పనిచేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుని ఎన్నికలను తారుమారు చేస్తున్నట్లు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఏకచ్ఛత్రాధిపత్యమే మోదీ ధ్యేయం. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కటానికి వెనకాడరని పశ్చిమ బెంగాల్ తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశీయ, విదేశీ విధానాల్లో నెహ్రూ విధానాలకు పూర్తి విరుద్ధమైన విధానాలు అనుసరించటం మోదీ ప్రత్యేకత. కాబట్టి మోదీ ఎంతకాలం పరిపాలించాడనే దానికన్నా భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థకు ఆయన చేస్తున్న హానిని ప్రతిఘటించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం దేశ ప్రజలముందున్న కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *