కుండపోత వానతో హైదరాబాద్ అతలాకుతలం.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్.. బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు..
Rains
మహానగరం హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. ఆఫీసులు ముగిసే సమయానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుండపోతగా వాన విరుచుకుపడటంతో నగరం అల్లాడిపోయింది. అత్యధికంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్ వార్డు ఆఫీసు ప్రాంతంలో 13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, బన్సీలాల్‌పేట్‌లో 8.75 సెం.మీ., హిమాయత్‌నగర్ విఠల్‌వాడీలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పాతబస్తీలో వీధిలైట్ల తీగ తెగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, చార్మినార్ సమీపంలోని ఛత్తాబజార్‌లో పాతకాలం నాటి ఓ కమాన్ స్వల్పంగా కూలింది. అంబర్‌పేట్, ముషీరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేెలకొరిగాయి. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
సరిగ్గా ఉద్యోగులు ఇళ్లకు బయల్దేరే సమయంలో వాన పడటంతో ప్రధాన రహదారులన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. మూడు కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్ల అధికారులు, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి వరదనీటిని దారి మళ్లించేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి-కొండాపూర్ మార్గం, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45-మైండ్‌స్పేస్ రహదారులపై తీవ్ర ప్రభావం కనిపించింది. ర్యాపిడో వంటి ఆన్‌లైన్ వాహన బుకింగ్‌లు పని చేయకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్‌టవర్స్ వరకు రాకపోకలు స్తంభించాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు 6వ ఫేజ్ ప్రధాన రహదారిపై నడుములోతు నీరు నిలవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మణికొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నెక్నాంపూర్ డివిజన్‌లోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు స్టీలు బ్రిడ్జిపైనా నీరు నిలిచిపోయింది. ఎప్పటిలాగే మలక్‌పేట ఆర్‌యూబీ (RUB) వద్ద మురుగునీటి పైపులైన్లు, వరద నాలాలు పొంగిపొర్లడంతో మెట్రోస్టేషన్ కిందనున్న రోడ్డు చెరువును తలపించింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ‘పసుపు’ (ఎల్లో) రంగు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.