మోదీ ప్రభుత్వ సంకటం
The Modi Government's Dilemma Sparks Political Debate
కాక్రోచ్ జనతాపార్టీ (సిజెపి) ఆన్ నుంచి వాస్తవ క్షేత్రంలోకి దిగి నీట్ యుజి ప్రశ్నాపత్రాల లీకేజి, సిబిఎస్ పరీక్షల్లో మార్కుల కేటాయింపు (ఆన్ మార్కింగ్ సిస్టం)లో అవకతవకలకు మోదీ ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, జూన్ 6న జంతర్ నిరసన వేదిక నుంచి విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ బర్తరఫ్ ను డిమాండ్ చేయటం, వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని ఆ పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించటం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, మోదీ నాయకత్వ ప్రతిష్టను పెద్ద సందిగ్ధావస్థలో పడేసింది. దేశంలోని విద్యార్థులు, యువతలో నెలకొని ఉన్న అసంతృప్తి, ఆగ్రహానికి ముందుగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజి, పరీక్ష రద్దు ఆజ్యం పోసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ‘నిరుద్యోగులను’ బొద్దింకలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యను వ్యంగ్యంగా చిత్రిస్తూ ఒక భారతీయ యువకుడు అమెరికా నుంచి సోషల్ మీడియా ఎక్స్ ఆన్ వదిలిన సిజెపి మిస్సైల్ యువతరంలోకి దూసుకెళ్లింది. రెండు రోజుల్లోనే అనూహ్యంగా రెండు కోట్లకుపైగా ఫాలోయర్లు మద్దతు తెలిపారు. ఇది పాలక బిజెపి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అది జాతీయ భద్రతకు ముప్పు అని గూఢచారి విభాగం ఊహ ప్రభుత్వానికి చేరింది. మార్చి 16 ఎక్స్ ప్రారంభించిన సిజెపి సోషల్ మీడియా అక్కౌంట్ మోదీ ప్రభుత్వం తొలగింపజేసింది. బిజెపి మద్దతుదారులు సోషల్ మీడియాలో సిజెపిని నానా దుర్భాషలాడారు. అంటే దేశం యువతనుంచి మోదీ ప్రభుత్వానికి రాగల ప్రమాదాన్ని వారు గ్రహించి, మొగ్గలోనే కాలరాసే ప్రయత్నం చేశారన్నమాట. ఆ సిజెపి వ్యవస్థాపకుడు దీప్కే తన ప్రాణానికి ముప్పురాగలదన్న హెచ్చరికలను త్రోసిపుచ్చి అమెరికానుండి శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. పెద్ద బందోబస్తు చూసి ఆశ్చర్యపోయాడు. ఈలోపు, గెలికితే ఎగిసిపడుతుందని పాలకులకు జ్ఞానోదయం అయిందేమో చెప్పలేముగాని, ఢిల్లీ పోలీసులు ఆ యువకుణ్ణి లాంజ్ తీసుకెళ్ళి, జంతర్ నిరసనకు అనుమతికోరే దరఖాస్తుపై సంతకం చేయించుకుని అక్కడికక్కడే పర్మిషన్ మంజూరు ఇచ్చారు. ఆన్ ప్రకటన ఆధారంగా కొద్దివేలమంది విద్యార్థులు, యువకులు జంతర్ చేరారు. వామపక్ష, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రేక్షకులుగా అక్కడికి చేరినా అది పూర్తిగా రాజకీయేతర సమూహం ఆందోళన. ప్రధాన్ తొలగించేందుకు మోదీకి శనివారం వరకు సమయమిచ్చి ప్రశాంతంగా వెళ్లిపోయారు. అనంతరం దీప్కే తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మహారాష్ట్రలోని తమ స్వస్థలానికి వెళ్లారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన దగ్గరనుంచీ నైతిక బాధ్యత వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా చెవివొగ్గని మోదీ ప్రభుత్వానికి ఆన్ ఉద్భవించిన హాస్య, వ్యంగ్య వేదిక ‘బొద్దింక జనతాపార్టీ’ ఎందుకు దడపుట్టించింది? పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాలలో జన్ తరం అయత్నకృత తిరుగుబాటుతో ప్రభుత్వాలు కూలిపోయిన పీడకల పీడించి ఉంటుంది!
సోషల్ మీడియా ప్లాట్ ఎక్స్ సిజెపి హాండిల్ తొలగింపజేసిన మోదీ ఉత్తర్వు, తాను ‘బొద్దింక’లని నిరుద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించలేదు, బోగస్ డిగ్రీలతో హడావుడి చేసేవాళ్లను అన్నానని జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చిన వివరణ ఎందుకు విఫలమయ్యాయన్నది ప్రశ్న. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం రెండింటి విశ్వసనీయతలో యువత భ్రమలు కోల్పోవటం ఒక సమాధానంగా కనిపిస్తున్నది. న్యాయవ్యవస్థ కీలకాంశాలపై సకాలంలో తీర్పులు ఇవ్వకుండా పర్యవేక్షక పాత్రవహిస్తూ, స్వామికార్యం నెరవేరాక తీర్పులివ్వటంలో దాని దిగజారుడుతనం కనిపిస్తోంది. బిహార్ ఓటర్ల జాబితా సమగ్ర సమీక్ష(‘సర్’) కు సంబంధించి ఎన్నికల కమిషన్ కేసులో మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడినాక ఇసి చర్యను సమర్థిస్తూ జస్టిస్ సూర్యకాంత్ తీర్పు ఇచ్చారు. ఈలోపు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కోట్లమంది ఓటర్ల తొలగింపు, ఇసి సహాయంతో బిజెపి బిహార్ ప్రభుత్వాన్ని నిలుపుకోవటం, ప.బెంగాల్ అధికారం చేజిక్కించుకోవటం జరిగిపోయాయి. ఈ రెండు ఎన్నికలు న్యాయబద్ధంగా, సజావుగా జరగలేదన్న భావన యువతరంలో ఉంది. పరీక్షల నిర్వహణ సహా వివిధ అంశాలపై జవాబుదారీతనాన్ని నిర్ణయించటం ద్వారా, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాల్సి ఉంది.
ప్రభుత్వ వ్యవస్థలకు ఎంత అహంకారమో, నోటిదురుసో చూడండి. సిబిఎస్ ఆన్ మార్కుల పద్ధతిలో తప్పులను ఎత్తిచూపిన విద్యార్థిని ప్రభుత్వ మీడియా యాంకర్లలో ఒకరు ‘పాకిస్థానీ’ (బిజెపికి అలవాటైన ముద్రవేసే పద్ధతి) అన్నారు. అది బెడిసికొట్టింది. అతనిది ఢిల్లీ. పార్లమెంటరీ కమిటీ అతన్ని పిలిచి అతని వివరణను విన్నది కూడా. ఈ ఉద్యమం వెనుక విదేశీ హస్తం ఉందన్న ప్రభుత్వ కథనాన్ని ముందుకు తేవటానికి పలువురు చేసిన ప్రయత్నం విఫలమైంది. కొందరు ముస్లింకోణం తేవటానికి ప్రయత్నించారు. ‘మీరు ఉద్యమంలో పాల్గోకండి పాల్గొన్నారో ప్రభుత్వం వెంటాడి వేధిస్తుంది’ అని ముస్లిం సంస్థలు చేసిన విజ్ఞప్తి ఫలించింది.
సిజెపి డిమాండ్ చేస్తున్న జవాబుదారీతనం ప్రధాన్ రాజీనామాకే పరిమితం కాదు. ఇతర అనేక సమస్యలు ఇమిడి ఉన్నాయి. సిజెపి డిమాండ్ చర్య తీసుకోకుండా ఉద్యమాన్ని అణచివేయటానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నిస్తే అది మోదీ ప్రతిష్టకు, ఆయన ప్రభుత్వ విశ్వసనీయతకు, రాజకీయ ఆధిపత్యానికీ తీరని హాని చేస్తుంది. ప్రధాన్ తొలగించి ప్రభుత్వ ప్రతిష్ట కాపాడుకోవాలనుకున్నా, ‘మోదీ ఒత్తిడికి తలొగ్గడని’ తెచ్చిపెట్టుకున్న ప్రతిష్ట మంటగలుస్తుంది. రైతుల సుదీర్ఘ ఆందోళనకు తలదించి మూడు కార్పొరేట్ అనుకూల చట్టాలు ఉపసంహరించుకుని దేశ ప్రజలకు తొలిసారి బహిరంగ క్షమాపణ చెప్పారు. కాని వారికిచ్చిన ‘పంటల ఎంఎస్ చట్టబద్ధ రక్షణ’ హామీ అమలు జరుపలేదు. ప్రస్తుత సమస్య, ప్రభుత్వ చర్య డిమాండ్ పర్యవసానం ఎలా ఉన్నా, సిజెపి ఉద్యమం మోదీ ప్రభుత్వాన్ని వెన్నాడుతూనే ఉంటుంది.