Skip to content
సంపాదకీయం వార్తలు

ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడెన్నడు?

Prajapaksham 13 Jun 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడెన్నడు?

When Will the Reins Be Tightened on Private Schools? (Photo Credit: AI Generated Image)

మరో రెండు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, ముఖ్యంగా హైదరాబాద్ లోని కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. అనేక చోట్ల యాజమాన్యాలు ఈ సారి 20 శాతం పెంచేశాయి. వీటికి అదనంగా పాఠశాలలే స్వంతంగా తయారు చేసి, ముద్రించే స్టడీ మెటీరియల్పై రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పిల్లలను బడికి పంపే ప్రైవేటు ఆటోలు, క్యాబ్లు, స్కూల్ బస్సుల ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణంతో విలవిలలాడుతున్న మధ్యతరగతిపై ఫీజుల పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. రాష్ట్రంలోని మూడింట రెండొంతుల తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. జాతీయ విద్యా హక్కు చట్టం కింద పాతిక శాతం సీట్లు పేదలకు కేటాయించాలన్న ఆదేశం ఎండమావిగా మారింది. నూతన ప్రభుత్వం వచ్చి సగం కాలం గడుస్తున్నప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో పెద్దగా మార్పు కనపడకపోగా, మరిన్ని కొత్త సంస్థలు వేళ్ళూనుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పాతుకుపోయిన రెండు, మూడు కార్పొరేట్ చెయిన్ విద్యా సంస్థలకు తోడుగా ఉత్తరాది నుంచి గత రెండేళ్ళ నుంచి కొత్త విద్యా సంస్థలు ఇంటర్మీడియెట్ స్థాయిలో అడుగుపెట్టాయి. తెలుగు రాష్ట్రాలలో విద్యా వ్యాపారం వందల కోట్లలో ఉండడమే ఇందుకు కారణం. అవి తాజా విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యారంగంలోకి కూడా ప్రవేశించాయి. పెద్ద ఎత్తున పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నాయి. చాలా మటుకు వాటికి వేరుగా అనుమతుల్లేవు. ఇప్పటికే ఉన్న చిన్న పాఠశాలల గుర్తింపుతో వాటిని లాగిస్తున్నారు. ప్రభుత్వాధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
పాలకులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రైవేటు విద్యా సంస్థలపై కొరడా ఝళిపిస్తానడం, ఆనక మిన్నకుండడం పరిపాటిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ సమగ్ర నివేదికను ఇచ్చినప్పటికీ అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ గురించి కమిషన్ కళ్ళకు గట్టినట్లుగా వివరించింది. తెలంగాణ ప్రైవేటు అన్ఎయిడెడ్ ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినప్పటికీ అది ముందుకు సాగడం లేదు. దాని అధ్యయనాన్ని ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టినా ఇంకా తెమలలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను 27వేల నుంచి4 వేలకు కుదిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బిఆర్ఎస్ హయాంలో మూసివేసిన 6వేల పాఠశాలలను తిరిగి మెరుగైన వసతులతో పునఃప్రారంభిస్తామని, ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రైమరీ స్కూలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన బాసలు మరవరాదు. దశలవారీగా ప్రైవేటుకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు ప్రభుత్వం పట్ల సానుకూలత తీసుకువచ్చాయి. కానీ, పాఠశాలల సంఖ్య తగ్గింపుపై సిఎం తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏ నేపథ్యంలో, ఎందుకు ఆ మాటలన్నారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ, అది తొందరపాటే. ఇప్పటికే ఇంటర్మీడియెట్ కు బదులు పాఠశాలల్లోనే పదవ తరగతి తరువాత ప్లస్ టూ విధానాన్ని ప్రవేశపెడతామని, గత విద్యా సంవత్సరం చివర్లో హడావుడిగా ప్రకటించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాగే జాతీయ విద్యా విధానంపై కమిటీ అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఎన్ఇపి కిందనే పిఎం శ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో పలు పాఠశాలు కేంద్రం నుంచి నిధులను స్వీకరిస్తున్నాయి.
ఇలాంటి వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా పెరిగిన ఫీజులను యుద్ధ ప్రాతిపదికన తగ్గించడం, వసూలు చేసిన ఫీజులను తల్లిదండ్రులకు ఇప్పించటం, ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతుల పెంపును రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *