మల్కాజిగిరిలో దారుణం.. రెండో భార్యపై అనుమానంతో కాల్పులు జరిపి హత్య చేసిన భర్త..
Malkajgiri Shocker: Husband Allegedly Kills Second Wife Over Suspicion
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని మారుతీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను ఎలాగైనా అంతం చేయాలని కక్ష పెంచుకున్న ఒక భర్త, పక్కా ప్రణాళికతో ఆమెను తుపాకీతో కాల్చి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ దుర్ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను, కలకలాన్ని రేకెత్తించింది.
పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరి మారుతీనగర్ ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె అనారోగ్యం కారణంగా వారికి విడాకులు ఇచ్చి, ఐదేళ్ల క్రితం ఆమె స్వంత సోదరి అయిన ఉషారాణిని (నిషా రాణి) యాదగిరిగుట్టలో రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగినప్పటికీ, ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానాన్ని అరుణ్‌కుమార్ పెంచుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా నిత్యం తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక ఉషారాణి అతనికి దూరంగా ఉంటోంది.
ఈ క్రమంలోనే భార్యపై తీవ్రమైన పగ పెంచుకున్న అరుణ్, ఎలాగైనా ఆమెను ప్రాణాలతో లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ ఏడాది మార్చి నెలలోనే బిహార్ ప్రాంతం నుండి అక్రమంగా ఒక దేశవాళీ తుపాకీ, బుల్లెట్లను తెప్పించుకున్నాడు. అంతేకాకుండా, ఆ తుపాకీని ఎలా కాల్చాలనే దానిపై రహస్యంగా ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే, ఆ సమయంలో అందిన పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని ఆయుధాలతో సహా పట్టుకోవడంతో మొదటిసారి అతని హత్యాయత్నం ప్లాన్ విఫలమైంది.
ఆయుధ చట్టం (Arms Act) కేసులో జైలుకు వెళ్లిన అరుణ్, ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు సరేకదా, భార్యపై కక్ష మరింత ముదిరింది. ఈ క్రమంలో బుధవారం వేకువజామున సుమారు 5:30 గంటల సమయంలో, పాత సమస్యల గురించి మాట్లాడుకుందామని నమ్మించి ఉషారాణిని బయటకు పిలిచాడు. పక్కా స్కెచ్‌తో తనతో పాటు మరో వ్యక్తిని కూడా వెంటబెట్టుకుని వచ్చిన అరుణ్, ఆమెతో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో తన వద్ద దాచుకున్న తుపాకీ తీసి ఆమెపై విచక్షణారహితంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు బలంగా దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కాల్పుల అనంతరం నిందితుడు అరుణ్‌కుమార్ తన సహచరుడితో కలిసి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పాతబస్తీలోని కొందరు స్నేహితుల ద్వారానే అరుణ్ ఈసారి కూడా తుపాకీని సమకూర్చుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.