Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైఎస్ జగన్‌ను కలిసిన అమరావతి రైతులు..అండగా ఉంటానని హామీ ఇచ్చిన మాజీ సీఎం..

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్‌ను కలిసిన అమరావతి రైతులు..అండగా ఉంటానని హామీ ఇచ్చిన మాజీ సీఎం..

DSC-2025 Candidates Meet YS Jagan on Wednesday Over Recruitment Concerns

అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆగడాలను, దౌర్జన్యాలను గట్టిగా అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తమ భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందంటూ అమరావతి ప్రాంత రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు ఆయన ధైర్యం చెప్పారు.

ఈ భేటీలో అమరావతి రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్‌ జగన్ ముందుంచారు. రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని, కొత్తగా భూ సేకరణ నోటిఫికేషన్లు ఇస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డెవలప్‌మెంట్‌ పనుల పేరుతో పొలాల్లోకి చొరబడి పంటలను, భూములను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరకట్ట రోడ్డును కేవలం విస్తరించుకుంటే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, రైతులకు ఇబ్బంది ఉండదని, కానీ ఇక్కడ ల్యాండ్‌ పూలింగ్ అవసరమే లేకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నారని తెలిపారు. ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి ఎలాంటి ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌, సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌లు నిర్వహించలేదని, అక్కడ నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి ఇప్పటికే పూర్తిగా కుంగిపోయిందని గుర్తుచేశారు. దేవాలయ భూముల్లో ఇప్పుడు ఇతరులకు ప్లాట్లు ఇస్తామంటున్నారని, ఆ పవిత్ర భూములను కాపాడుకోవడంలో తమకు తోడుగా నిలిచి, అసెంబ్లీలోనూ, బయటా గట్టిగా గళం వినిపించాలని రైతులు జగన్‌ను కోరారు.

రైతుల విజ్ఞప్తిపై స్పందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కూటమి ప్రభుత్వ రాజధాని విధానాలపై మరియు చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే తాము ముందుకెళ్తామని, అన్నదాతలను కష్టపెట్టేలా కాకుండా వారిని సంతోషపెట్టేలా నిర్ణయాలు ఉండాలని, బలవంతంగా భూములు లాక్కోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన మొదటి 50 వేల ఎకరాల్లోనే ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో 50 వేల ఎకరాలు సేకరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్నప్పటికీ, పంతానికి పోయి పనులు జరుగుతున్న చోట మరొక ఎయిర్‌పోర్టు అంటున్నారని మండిపడ్డారు.

మన హయాంలో మచిలీపట్నం పోర్టు పనులను నిధుల కొరత లేకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లామని, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల కనెక్టివిటీ ఉన్నప్పటికీ చంద్రబాబుకు మాత్రం ఇవేవీ పట్టవని విమర్శించారు. భవిష్యత్తులో ఏపీకి రాజధాని అనేది లేకుండా చేసేలా వీరి వ్యవహారశైలి ఉందన్నారు. కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకే అమరావతిలో ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని జగన్ లెక్కలతో వివరించారు.

జీవితకాలమంతా కేవలం రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు తవ్వడానికి, నీళ్లు, కరెంటు ఇవ్వడానికే దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందని ప్రశ్నించారు. అమరావతిలో ఏది చూసినా అవినీతి, స్కాములే కనిపిస్తున్నాయని ఆరోపించారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా తాము సూచించిన ‘మావిగన్’ను గ్రోత్‌ కారిడర్‌గా ప్రకటిస్తే తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ పేర్కొన్నారు. 110 కిలోమీటర్ల మేర ఈ గ్రోత్ కారిడార్‌కు ఇరువైపులా ఈ నిధులు పెడితే మొత్తం ప్రాంతం వేగంగా ఆర్థిక హబ్‌గా మారుతుందని, దీనిపై తాము రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *