Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session: మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగారు.. ఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్సీకి సబితాఇంద్రారెడ్డి ఫిర్యాదు..డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన..

jagan 11 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session: మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగారు.. ఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్సీకి సబితాఇంద్రారెడ్డి ఫిర్యాదు..డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన..

Sabitha Indra Reddy

Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ ప్రాంగణం వేదికగా ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ సమరం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (NHRC) ఆశ్రయించింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని మహిళా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల బృందం ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు విజయభారతిని కలసి సమగ్ర నివేదికతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలితో భేటీ అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. శాసనసభ ప్రాంగణం వద్ద పోలీసులు తమ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభలోకి వెళ్తున్న తమను అడ్డుకోవడమే కాకుండా, పోలీసులు ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగుతూ, ఈడ్చిపారేస్తూ తీవ్రంగా భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక శాసనసభ్యురాలిగా, మహిళగా తమ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు.

మహిళా ప్రజాప్రతినిధులను రక్షించేందుకు ముందుకు వచ్చిన తోటి ఎమ్మెల్యేలపై కూడా పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కేశారని, ఈ తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురై రక్తపోటు పెరిగిందని తెలిపారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, మహిళా నేతలు తీవ్ర గాయాలపాలయ్యారని సభాపతి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు.

శాసనసభ ఆవరణలోకి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వెళ్లకుండా నిరోధించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ భౌతిక దాడి ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ, బాధ్యులైన పోలీసు అధికారులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లి రాతపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి కానీ, పోలీసు యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తాము జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు.

ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు విజయభారతికి తమకు జరిగిన అన్యాయాన్ని, పోలీసుల దాడికి సంబంధించిన ఆధారాలను సమర్పించినట్లు బీఆర్ఎస్ బృందం తెలిపింది. ఈ ఘటనపై తక్షణమే ఒక స్వతంత్ర బృందంతో విచారణ జరిపించాలని, బాధ్యులైన ఉన్నతాధికారులతో పాటు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన పోలీసులే అధికార పక్షానికి కొమ్ముకాస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయాన్ని తాము పార్లమెంటరీ వేదికలపై కూడా లేవనెత్తుతామని హెచ్చరించారు.

శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల సమస్యలను ఎండగడుతున్నందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనలు, తదనంతరం బీఆర్ఎస్ ఢిల్లీ స్థాయిలో చేపట్టిన ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.