SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి
SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక ప్రభావం
మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల ఇఎఫ్ల డిజిటలైజ్
సోమవారంతో ముగియనున్న ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్ఐఆర్)
ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఇఎఫ్) పంపిణి చేయగా, వాటిలో 2,64,30,494 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. సోమవారంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుండగా, ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
డిజిటైజేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మూడు నగర జిల్లాలైన హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలపై అత్యధిక ప్రభావం కనిపిస్తోంది. ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓటర్లు ఇంకా డిజిటైజేషన్‌కు దూరంగా ఉండటంతో తుది ఓటరు జాబితాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర ఓటర్ జాబితా గణాంకాలు
మొత్తం ఓటర్లు : 3,38,26,448.
ఈఎఫ్ పంపిణి : 3,38,26,448 (100 శాతం).
డిజిటైజేషన్ పూర్తి : 2,64,30,944 (78.14 శాతం).
ముసాయిదా ఓటరు జాబితా : ఆగస్టు 17.
అభ్యంతరాలు, క్లెయిమ్లు: ఆగస్టు 17 సెప్టెంబర్ 16.
తుది ఓటరు జాబితా : అక్టోబర్ 19.
హైదరాబాద్లో కేవలం 57.88 శాతం మాత్రమే
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యల్ప డిజిటైజేషన్ హైదరాబాద్ జిల్లాలో నమోదైంది. జిల్లాలోని 47,36,669 లో 27,74,827 మంది (57.88 శాతం) ఈఎఫ్లు మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. అంటే ఇంకా దాదాపు 20.62 లక్షల మంది ఓటర్ల ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29,79,130 లో 19,83,821 మంది (66.58 శాతం), రంగారెడ్డి జిల్లాలో 36,99,743 లో 24,01,390 (64.91 శాతం) ఈఎఫ్లు డిజిటైజ్ అయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి.
పలు జిల్లాల్లో 90 శాతానికి పైగా పురోగతి
ఇక మరోవైపు పలు జిల్లాలు డిజిటైజేషన్‌లో 90 శాతానికి పైగా పురోగతి సాధించాయి. యాదాద్రి భువనగిరి (94.37 శాతం), సూర్యాపేట (90.43 శాతం), మహబూబాబాద్ (90.07 శాతం), జగిత్యాల (89.40 శాతం), నల్లగొండ (89.45 శాతం), సిద్దిపేట (87.99 శాతం) జిల్లాలు ముందంజలో ఉన్నాయి.
సోమవారం వరకు చివరి అవకాశం
ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవులు అయినప్పటికీ బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది విధుల్లో కొనసాగనున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు సోమవారం వరకు తమ ఫారాలను అందజేయాలని అధికారులు సూచించారు. చివరి రెండు రోజుల్లో అందిన ఫారాలను కూడా డిజిటైజ్ చేసి, అనంతరం ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేయనున్నారు.
తుది జాబితాలో భారీ మార్పుల అవకాశాలు
ప్రత్యేకించి హైదరాబాద్ నగర పరిధిలో డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, ఫారాలు సమర్పించని వారి వివరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యంతరాలు, అభ్యర్థనలను స్వీకరించి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఈ గణాంకాల ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా, ముసాయిదా ఓటరు జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు, సవరణలకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇవ్వనుంది.