Pakistan Cosmetics: పాకిస్థాన్ నుంచి అక్రమ దిగుమతులు. రూ.7 లక్షల కాస్మోటిక్స్ సీజ్
Pakistan Cosmetics: హైదరాబాద్‌లో ఐదు దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు. 17 రకాల ఉత్పత్తుల స్వాధీనం.
పాకిస్థాన్‌లో తయారైన కాస్మెటిక్ ఉత్పత్తులను అనుమతులు, అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండా నగరంలో విక్రయిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ రాజేంద్రనగర్ జోన్ అధికారులు దాడులు నిర్వహించారు. హబీబ్ నగర్, నాంపల్లిలోని మూడు దుకాణాలతో పాటు శాంతినగర్‌లోని మరో దుకాణంలో తనిఖీలు చేపట్టి సుమారు రూ.7 లక్షల విలువైన కాస్మెటిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సీడీఎస్‌సీఓ అధికారులు ఉత్పత్తులను పరిశీలించి, వాటిలో కొన్ని ఇప్పటికే అనధికారిక లేదా నిషేధిత ఉత్పత్తులుగా గుర్తించినవని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 30న టాస్క్‌ఫోర్స్ రాజేంద్రనగర్ జోన్ పోలీసులు, సీడీఎస్‌సీఓ అధికారులతో కలిసి బ్యూటీ లేడీస్ ఎంపోరియం, బ్యూటీ క్వీన్ షాప్, ఎస్తె మెడికల్ షాప్ తనిఖీలు నిర్వహించారు. సీడీఎస్‌సీఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు డాక్టర్ శ్రీధర్ మిట్టపల్లి, అంజన్ గౌడ్ పెండెం ఉత్పత్తులను పరిశీలించి వాటి చట్టబద్ధత, దిగుమతి అనుమతులను ధ్రువీకరించారు.
పోలీసుల ప్రకారం.. గోరీ, చాందినీ, ఫైజ్, నావియా, పార్లీ గోల్డీ, అనీజా, నూర్ గోల్డ్, అర్జూ, శాండల్, ఫేస్ ఫ్రెష్, ఫజ్రా గోల్డ్, గోల్డెన్ పర్ల్, సదాఫ్, వెల్కమ్ తదితర బ్రాండ్లకు చెందిన బ్యూటీ క్రీములు, స్కిన్ వైటెనింగ్ క్రీములు, సబ్బులు, సీరమ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
సీడీఎస్‌సీఓ సెప్టెంబర్ 8న జారీ చేసిన ప్రజా ప్రకటనలో పేర్కొన్న అనధికారిక, నిషేధిత కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కొన్ని ఈ తనిఖీల్లో లభించినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత ఉత్పత్తులను భారత్‌లో దిగుమతి చేసుకునేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ కాలేదని తెలిపారు. కొన్ని ఉత్పత్తుల్లో అనుమతించిన పరిమితికి మించి భారీ లోహాలు ఉండే అవకాశం ఉందని, అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని సీడీఎస్‌సీఓ హెచ్చరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ముంబై డీలర్ నుంచి సరఫరా?
ప్రాథమిక దర్యాప్తులో కాస్మెటిక్ ఉత్పత్తులను ముంబైకి చెందిన ఓ డీలర్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోని వ్యాపారులకు సరఫరా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక వ్యాపారులు ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్‌లు, ఇతర ఆధారాలను సక్రమంగా నిర్వహించలేదని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు.
అదేవిధంగా శాంతినగర్‌లోని మదీనా కాస్మెటిక్ దుకాణంలో సయ్యద్ ఇస్మాయిల్ కూడా ఇలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో రియాజుద్దీన్ పాత్రపైనా విచారణ కొనసాగుతోంది.
దుకాణాల్లో లభించిన స్టాక్‌తో పాటు మరో గోడౌన్‌లో అదనపు సరుకు ఉన్నట్లు గుర్తించడంతో దాని ప్రాంతం, యాజమాన్యం, నిల్వల పరిమాణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో మొహమ్మద్ ఫజల్, మొహమ్మద్ అయాన్, మొహమ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ అబిద్ అలీ, సయ్యద్ ఇస్మాయిల్‌ను విచారణ పరిధిలోకి తీసుకున్నారు.
ఇదే తరహా ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇతర దుకాణాలు, వ్యక్తుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.