H-1B Visa News: హెచ్-1బీ వీసాలు పూర్తిగా రద్దు చేయాలి.. అమెరికాలో ఉద్యోగం కోసం ఎవరూ రాకూడదు.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
jd vance
H-1B Visa News: అమెరికాలో ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్-1బీ వీసా (H-1B Visa) విధానం పూర్తిగా విఫలమైందని పేర్కొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.
ఎయిర్ ఫోర్స్ టూ విమానంలో ప్రముఖ వ్యాఖ్యాత జాక్ పోసోబిక్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ, అకౌంటింగ్ కంపెనీలతో పాటు ఇతర పెద్ద యాజమాన్యాలు అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి ఈ వీసా విధానాన్ని ఒక సాధనంగా మార్చుకుని దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఒక అమెరికన్ అకౌంటెంట్ ఏడాదికి 60,000 డాలర్ల జీతం తీసుకుంటుంటే, వారి స్థానంలో హెచ్-1బీ వీసాపై వచ్చిన విదేశీయుడిని కేవలం 45,000 డాలర్లకే నియమించుకుంటున్నారని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇది అమెరికన్ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఆయన వాపోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను దేశంలోకి తీసుకురావాలనే హెచ్-1బీ వీసా అసలు ఉద్దేశం దెబ్బతింటోందని, అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం అసాధ్యమని భావించిన తర్వాత, గతంలో ట్రంప్ ప్రభుత్వం కొన్ని కొత్త హెచ్-1బీ పిటిషన్లపై అధిక ఫీజులు విధించే చర్యలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అమెరికాలో విదేశీ నిపుణులు పనిచేయడానికి అత్యంత కీలకమైన ఈ హెచ్-1బీ వీసాలపై భారతీయ ఐటీ రంగానికి చెందిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులే అధికంగా ఆధారపడి ఉన్నారు. ప్రతి ఏటా జారీ అయ్యే లక్షలాది వీసాలలో సింహభాగం భారతీయులకే దక్కుతోంది. ఇప్పుడు ఏకంగా ఉపాధ్యక్షుడి స్థాయి వ్యక్తి నుంచి దీనిని పూర్తిగా రద్దు చేయాలనే ప్రతిపాదన రావడం , ఈ వ్యాఖ్యలకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా బహిరంగంగా మద్దతు తెలపడం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీలతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలపై కూడా ఈ ప్రకటన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కాలం నుండి డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ యంత్రాంగం స్వదేశీ ఉద్యోగాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, ఈ స్థాయిలో వీసా వ్యవస్థను రద్దు చేస్తామనే ప్రకటన రావడం వల్ల అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు, టెక్కీల భవిష్యత్తుపై తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా లేక అమెరికా కాంగ్రెస్‌లో నిజంగానే చట్టపరమైన మార్పులకు దారితీస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంది.
- Amit Shah VS Abhijit Dipke: 2029లో గెలుపుపై ముందే ధీమానా? అమిత్ షా మాటల్లోనే దొంగతనం బయటపడింది..దిప్కే కౌంటర్..
- Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
- Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద కత్తితో మహిళ హల్చల్.. దాడికి యత్నించిందని టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
- LB Nagar Double Decker Corridor: ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌కు మరో కీలక ప్రాజెక్టు!
- CM Revanth Reddy: సీఎం రేవంత్ లాజిక్ కు బీజేపీ షాక్: జనాభా పెరుగుతుంటే.. 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి?