Auto Fare Hike in Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ. 30గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Auto
Auto Fare Hike in Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షా ప్రయాణికులకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. దీర్ఘకాలంగా ఆటో డ్రైవర్లు చేస్తోన్న డిమాండ్లను పరిశీలించిన రవాణా శాఖ, నూతన ఆటో ఛార్జీల పెంపును ఖరారు చేస్తూ జీవో నంబర్ 46 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఇంధన ధరలు, వాహన విడిభాగాల వ్యయం, నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రవాణా శాఖ విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఆటోలో ప్రయాణించే తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీగా 30 రూపాయలను నిర్ణయించారు. ఆ తర్వాత ప్రయాణించే ప్రతి అదనపు కిలోమీటర్‌కు 14 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ వల్ల లేదా ప్రయాణికుడి కోరిక మేరకు ఆటో నిలిచి ఉంటే నిమిషానికి 75 పైసల చొప్పున వెయిటింగ్ ఛార్జీ వర్తిస్తుంది. అలాగే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చేసే ప్రయాణాలకు సాధారణ మీటర్ ఛార్జీపై అదనంగా 50 శాతం ఎక్కువ వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
లగేజీ విషయానికి వస్తే ప్రయాణికుడి వద్ద ఉండే సాధారణ బ్రీఫ్‌కేస్ లేదా హ్యాండ్‌బ్యాగ్‌లకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అయితే ఇతర పెద్ద ప్యాకేజీలు ఉన్నట్లయితే ప్రతి ప్యాకేజీకి కిలోమీటరుకు 50 పైసల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆటోలో గరిష్ఠంగా 100 కిలోల వరకు లగేజీని మాత్రమే అనుమతిస్తారు.
కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లను సవరించుకోవడానికి ఆటో యజమానులకు రవాణా శాఖ మూడు నెలల గడువు ఇచ్చింది. మీటర్ల సవరణ పూర్తయ్యే వరకు ప్రయాణికులకు కొత్త, పాత ఛార్జీల వివరాలు స్పష్టంగా తెలిసేలా ఆటోల్లో రవాణా శాఖ ధ్రువీకరించిన ఫేర్ కార్డులను విధిగా ప్రదర్శించాలని అధికారులు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత ఛార్జీలు పెంచడం ఆటో కార్మికులకు ఊరటనిచ్చినప్పటికీ, రోజువారీ ప్రయాణికులపై ఇది తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.
- Pakistan Cosmetics: పాకిస్థాన్ నుంచి అక్రమ దిగుమతులు. రూ.7 లక్షల కాస్మోటిక్స్ సీజ్
- CJP Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.. సీజేపీ నిరసనతో ముంబై శివాజీ పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నటుడు నసీరుద్దీన్ షా హాజరు..
- Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..
- Auto Fare Hike in Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ. 30గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ