రాష్ట్రంలో ముంచుకొస్తున్న వర్షాభావ పరిస్థితులు
Telangana Drought
ఉజ్జిని రత్నాకర్ రావు
దేశంలోని ఒక ప్రాంతంలో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే మరో ప్రాంతంలో రైతులు వర్షం కోసం ఆకాశము వైపు చూస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆసోమ్, గుజరాత్, యూపీ, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మొదలగు ప్రాంతాలలో భారీ వర్షాలు వరదలు నమోదు అవుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో మొత్తంమీద ఆగ్నేయ రుతుపవనాల వర్షపాతం 12శాతం లోటు నమోదైంది. అదేకాదు సమస్య, గతంలో విస్తారంగా సమానంగా కురిసే వర్షం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొద్దిగంటల్లోనే భారీగా కురుస్తుండగా ఇతర ప్రాంతాలు వర్షాభావ ప్రాంతంగా ఉంటున్నాయి.
వాతావరణములో వస్తున్న మార్పులే ప్రధాన కారణమే అయినప్పటికీ, అది ఒకటే కాదు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల గాలిలోతేమ నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో అనుకూల పరిస్థితులు ఏర్పడితే తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయములో గాలులదిశ, వాతావరణ వ్యవస్థలు, పట్టణీకరణ, భూవినియోగ మార్పులు స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి ప్రాంతాల మధ్య వర్షపాతం తీవ్రత లో తేడాలు పెరుగుతున్నాయని వాతావరణ నిఫుణులు తెలుపుతున్నారు.
తెలంగాణలో నేటికీ లోటు
వర్షపాతమే!
భారీ వర్షాలు కురవాల్సిన ఆగస్టులో అంతంతమాత్రంగానే వర్షాలు పడటంతో తెలంగాణలో సగానికి పైగా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయింది. 17 జిల్లాల్లో మైనస్ 29 నుంచి 60 శాతం లోటు వర్షపాతం నమోదయింది. కేవలం 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏ ఒక్క జిల్లాలోనూ అత్యధిక వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు సెప్టెంబర్ నెలలో గత నాలుగైదు రోజులలో కురిసిన వర్షాలతో ఉత్తర తెలంగాణలో కొంతవరకు వరి పంటలకు కొంత ఊతమిచ్చే అవకాశం ఏర్పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో తీవ్ర నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 74.06 సెం.మీ ఉండగా, ప్రస్తుతం నమోదయింది 61.53 సెo. మీ. మాత్రమే. సాధారణ వర్షపాతం కంటే 12.53 సెం.మీ. తక్కువ వర్షపాతం నమోదయింది. ఈ సీజన్లో కురిసే వర్షపాతం లో 17% తక్కువ వానలు కురిశాయి.
రాష్ట్రంలో మంచిర్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల,కామారెడ్డి, మెదక్ జిల్లాలోమాత్రమే సాధారణ వర్షాలు నమోదయినవి. మిగిలిన అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదయిం ది. రాష్ట్ర ప్రణాళిక శాఖ 16 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్లు, మిగిలిన 17 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది. మండలాల వారిగా వర్షపాతం పరిశీలిస్తే 41 మండలాల్లో అధికం, 270 మండలాల్లో సాధారణం, 308 మండలాల్లో లోటు నమోదైనట్లు
వివరించింది.
ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉంటుందని ఆరు మాసాల ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. దానికి తగినట్టుగా రైతులను చైతన్యంచేస్తూ ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని.. త్రాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటినుండే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు వాతావరణ నిపుణులు చెబుతూ వచ్చారు. ఆగస్టు నెలలో నమోదైన వర్షపాతం కేవలం 133 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే ఈ ఒక్క నెలలోనే 36% లోటు వర్షపాతం నమోదయింది. కాగా గత ఏడాది ఇదే నెలలో భారీ వర్షాలు కురిశాయి. అంటే ఏకంగా 377 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర సగటు వర్షపాతం 565 మిల్లి మీటర్లు కాగా ఇప్పటివరకు అది కేవలం 472 మిల్లీమీటర్లకే
పరిమితమైంది.
ముగిసిన ‘నైరుతి’వర్షాలు!
నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. రాష్ట్రానికి ప్రధాన ఆయువుపట్టుగా ఉండే రుతుపవన వర్షాలు ఈ ఏడాది నిరాశే మిగిల్చాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఎల్‌నినో ప్రభావం దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు కీలక దశలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుదీర్ఘ పొడి వాతావరణం నెలకొనడం పంటలపై ప్రభావం చూపింది. నల్లగొండ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 11.23 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుత వానకాలం సీజన్లో దాదాపు 9.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోనికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్తి సుమారు 5.5 లక్షల ఎకరాల్లో సాగుకు గాను వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లోనే సాగవుతోంది. ప్రారంభంలో వర్షాలు పడటంతో రైతాంగం ఉత్సాహంగా పంటలు వేసుకొన్నారు. కొంతమేర ఆశాజనకంగా కనిపించినా.. ఆ తర్వాత వర్షాలు రాకపోవ డం సమస్యగా మారింది. చెరువులు, కుంటలకు తగినంత వరద నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు పడకపోవడం.. పొడి విరామము ఏర్పడటం వల్ల పంటలకు అవసరమైన సమయం లో తేమఅందక దిగుబడి పూర్తిగా తగ్గిపోయి పెట్టుబడులు రాని పరిస్థితులు ఉన్నాయని రైతాంగం ఆందోళనలో ఉన్నారు.
ప్రధాన ప్రాజెక్టులు వెలవెల..
ఎల్‌నిలో ప్రభావంతో రిజర్వాయర్లు వెలబలబోతున్నాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్టా, గోదావరి నదులకు పెద్దగా వరదలు రాలేదు. శ్రీశైలంలోనూ నీటి నిల్వ వేగంగా పడిపోతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 93 టీఎంసీల నిల్వ ఉండగా.. డెడ్ స్టోరేజ్ కు ఎగువ ఇంకా కేవలం 40 టిఎంసి నీళ్లు ఉన్నాయి. ఏపీ మాత్రం నీటిని తోడడం ఆపడం లేదు. ఇటు నాగార్జునసాగర్ లోనూ డెడ్ స్టోరేజ్‌కు ఎగువన 40 టిఎంసిల చొప్పున మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలం వరకు త్రాగునీటి కోసం నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది సరైన వరదన్నదే రాలేదు. ప్రస్తుతము ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీలకు గాను 47 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి. అంటే వాడుకోవడానికి ఇంకో 40 టిఎంసిల వాటర్ అందుబాటులో ఉన్నాయి.
ఎత్తిపోతల పథకాలైన పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఏఎంఆర్ తగినంత నీరు లేకపోవటంతో పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయలేకపోతున్నారు. ఉన్న నీటిని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి అవసరాల కోసం ఉంచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
పంటలు ఎండిపోతున్నాయని రైతాంగం జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయటం.. రైతులు రోడ్ల మీదికి రావడం.. ప్రభుత్వం తాత్కాలిక చర్యలులో భాగం గా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మూడు టీఎంసీల నీరుని విడుదలకు ఒప్పించి పంటలను కాపాడుకొనుటకు జూరాల కాలువలకు నీళ్లు విడుదల చేయడం జరిగింది.
ఒకవైపు ఎల్‌నినో ప్రభావం మరోవైపు పాలకుల వైఫల్యం వెరసి అన్నదాత పాలిట శాపంగా పరిణమించాయి. ఎల్ నినో ప్రభావం కేవలం తెలంగాణ పైనే కాదు యావత్ దేశంపై కూడా ఉందనే విషయం వాస్తవమే అయినా, ఇక్కడ ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం సాగుకు కష్టాలను తెచ్చిపెట్టింది. వరి వేసుకోకుండా మెట్ట పంటలు వేసుకోవాలని సీజన్ కు ముందు నుండే రైతాంగానికి అవగాహన కల్పించేది ఉండే. ఇందులో ప్రభుత్వం వ్యవసాయ శాఖ వైఫల్యం కనిపిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలోనూ.. నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను సత్వరము పూర్తి చేసి తెలంగాణలో అని ప్రాంతాలకు సాగునీటి అందించాలంటూ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు కోరుతూ వచ్ఛారు. కానీ పాలకులు ఆ మాటలను పట్టించుకున్న పాపాన పోలేదు.
ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్న కరువు కాటకాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రధానమైన ప్రాజెక్టులను పూర్తి చేయుటకు యుద్ధ ప్రాతిపదిగా చర్యలు చేపట్టి పూర్తి చేయాలి.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..