Skip to content
క్రీడలు వార్తలు

భారత క్రికెట్‌కు కొత్త స్టార్.. సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ..

Prajapaksham 06 Jun 2026 1 నిమిషాల పఠనం క్రీడలు
భారత క్రికెట్‌కు కొత్త స్టార్.. సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ..

ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారిన 15 ఏళ్ల భారత యువ బ్యాటర్ వైభవ్‌ సూర్యవంశీ తాజాగా మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు. అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ బిహారీ బుడ్డోడు తొలిసారిగా భారత సీనియర్‌ క్రికెట్ జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించాడు. త్వరలోనే జరగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల (Asia Games) కోసం ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో వైభవ్‌ చోటు దక్కించుకోవడం విశేషం. తద్వారా అత్యంత పిన్న వయస్సులోనే భారత సీనియర్‌ జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ క్రమంలో వైభవ్ ఏకంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట సుమారు 37 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1989లో తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయగా, వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికై సచిన్ రికార్డును అధిగమించాడు. జూన్‌ 26 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో వైభవ్‌ బరిలోకి దిగడం దాదాపు ఖరారైంది. ఈ లెక్కన మ్యాచ్ ఆడే సమయానికి అతని వయసు 15 ఏళ్ల 91 రోజులు ఉంటుంది కాబట్టి, అత్యంత చిన్న వయసులో టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా కూడా అతను నిలవబోతున్నాడు.

భారత జట్టులోకి ఈ ఎంపిక ద్వారా వైభవ్‌ అంతర్జాతీయ స్థాయిలో మరో చారిత్రక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఐసీసీ (ICC) పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న దేశాల జట్లలో అత్యంత పిన్న వయసులో టీ20 అరంగేట్రం చేయనున్న ఆటగాడిగా వైభవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన స్టార్ స్పిన్నర్ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పేరిట ఉంది. ముజీబ్‌ 2018లో తన 16 ఏళ్ల 314 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు.

రాబోయే ఐర్లాండ్ సిరీస్‌లో (15 ఏళ్ల 91 రోజుల వయసులో) వైభవ్‌ బరిలోకి దిగడం ద్వారా ముజీబ్ రికార్డు కనుమరుగు కానుంది. కాగా, ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం​ చేసిన రికార్డు రొమేనియాకు చెందిన ఎం. ఘెరసిమ్‌ పేరిట ఉంది. ఇతను 2020లో కేవలం 14 ఏళ్ల 16 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఈ అరుదైన రికార్డు సాధించాడు.