ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు కొత్త టీ20 కెప్టెన్‌ను ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్..
BCCI Announces New T20I Captain for Ireland, England Series and Asian Games
భారత క్రికెట్‌లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల (Asian Games) కోసం భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం శనివారం (జూన్ 6) కీలకమైన మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ ఎంపికలో సెలక్టర్లు ఊహించని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నియమితుడయ్యారు. గత కొంతకాలంగా జట్టుకు సారథ్యం వహించి, భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026 అందించిన సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని సూర్యను కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా జట్టు నుంచే పూర్తిగా తొలగించారు. ఆసియా క్రీడల్లో కూడా శ్రేయస్ అయ్యరే జట్టును నడిపించనుండగా, వైస్ కెప్టెన్‌గా హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ నియమితుడయ్యారు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. తద్వారా భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (16 ఏళ్లు) పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ కూడా టీ20 జట్టులో చోటు సంపాదించాడు. తెలుగు రాష్ట్రాల నుండి నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ మూడు జట్లలోనూ స్థానం సాధించి సత్తా చాటారు.
పర్యటనలకు ఎంపికైన భారత జట్లు ఇవే:
ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా.
ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కు జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.
ధ్రువ్ జురెల్ సారథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు
జూన్ 25 నుంచి శ్రీలంకలో పర్యటించాల్సిన ఇండియా-‘ఎ’ జట్టును కూడా బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మల్టీ-డే (అనధికారిక టెస్టు) మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా, దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, అన్షుల్ కంబోజ్ లాంటి ఐపీఎల్ స్టార్లకు చోటు దక్కింది.
ఇండియా-ఎ శ్రీలంక పర్యటన షెడ్యూల్:
జూన్ 25: తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)
జూలై 2: రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)
ఇండియా-ఎ జట్టు: ధ్రువ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీ.