Skip to content
క్రైమ్ వార్తలు

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి

Prajapaksham 09 Jun 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి

RTC Bus Overturns in Wanaparthy; RTC Executive Engineer Dies, 14 Injured

దుబాయ్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో సహా మొత్తం ఏడుగురు భారతీయులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రోడ్డుపై సోమవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ట్రక్కు సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక మినీబస్సు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు మినీబస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరిపి, బస్సు డ్రైవర్ తగినంత అప్రమత్తతతో లేకపోవడం , ముందు వాహనానికి తగినంత సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్దుల్ రఫీక్, కొడిమ్యాల మండలానికి చెందిన సయ్యద్ సలీం, , మల్యాల మండలానికి చెందిన గజుల తిరుపతిగా గుర్తించారు. అలాగే గాయపడిన తొమ్మిది మందిలో హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ సయీద్ కూడా ఉన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారందరినీ పోలీసులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

బాధితులంతా షార్జా కేంద్రంగా పనిచేస్తున్న ఒక అల్యూమినియం గ్లాస్ , డోర్ ఫ్రేమ్ పరిశ్రమకు చెందిన కార్మికులుగా తేలింది. ఈ పరిశ్రమను కేరళకు చెందిన ఒక భారతీయ పారిశ్రామికవేత్త నిర్వహిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు. కాన్సులేట్ ప్రతినిధులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకుని గాయపడిన భారతీయులను పరామర్శించారు. బాధితులకు , వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల దౌత్యపరమైన సహాయ సహకారాలను అందించేందుకు దుబాయ్ స్థానిక అధికారులతో కలిసి నిరంతరం శ్రమిస్తున్నట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది.