భారీ వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష.. అవసరమైతే తానూ రోడ్లపైకి వస్తానని వెల్లడి..
Revanth Reddy Fires on Officials, Warns to Hit Roads if Needed for Rain Relief
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవాలని ఆయన గట్టిగా ఆదేశించారు. గత జూన్ 1వ తేదీనే వర్షాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ముందస్తు సూచనలు జారీ చేసినప్పటికీ, జూన్ 9న కురిసిన భారీ వర్షం సమయంలో అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించారని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రోజు నగరంలో తలెత్తిన తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. మున్సిపల్, పోలీస్ వంటి కీలక శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై వర్షాలు కురిసే సమయంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, విద్యుత్ శాఖల ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా రోడ్లపైనే ఉండి విధులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే మానవ తప్పిదాలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేదా వరదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి వీలుగా ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే నీరు నిలిచే ప్రాంతాలు, ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వివరాలను ముందుగానే సేకరించి, వాటికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులెత్తించేందుకు ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.