రెంటికీ చెడిన రేవడి కీర్ స్టార్మర్
keir starmer ( Image Source: Social Media)
అరుణ్ శ్రీవాస్తవ
బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పదవీకాలం రాజకీయంగా మితవాదం దిశగా నిర్ణయాత్మకంగా మారడం, పార్టీ సోషలిస్ట్ పునాదిని క్రమపద్ధతిలో విడిచిపెట్టడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్ పార్టీలోని వామపక్ష, మార్క్సిస్ట్ వర్గాలు ముందుండి నడిపించిన ఒక భారీ తిరుగుబాటు కారణంగా స్టార్మర్ నిష్క్రమణ అనివార్యమైంది. ఈ సంక్షోభం నుండి ఆయనను గట్టెక్కిస్తారని భావించిన మితవాద శక్తు లు, ఆయనను రక్షించలేదు. పైగా ఆయనకు అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించేందుకు నిరాకరించాయి. ఇందు కు విరుద్ధంగా, సంప్రదాయవాద, మితవాద నాయకులు ఆయన పరిపాలనలో సైనిక వ్యయం, వలస విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రధానమంత్రి పదవి పతనమవుతున్న సమయంలో ఎలాంటి రాజకీయ రక్షణ కల్పించలేదు. స్టార్మర్ రాజీనామా చేయడానికి కొద్దికాలం ముందు రక్షణ మంత్రి జాన్ హీలీ, సాయుధ దళాల మంత్రి అల్ కార్న్స్ రాజీనామా చేశారు.
ఆయనను రక్షించేందుకు బదులుగా, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ స్టార్మర్‌పై నిర్విరామంగా దాడి చేసింది. ఆయన విధానాలు సైనిక సంసిద్ధతను తగ్గించాయని, దేశ జాతీయ భద్రతను నేరుగా బలహీనపరిచాయని ఆరోపించింది. ఈ శక్తులను ప్రసన్నం చేసుకోవడానికే స్టార్మర్, ఇరాన్‌పై దాడి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌కు సైతం మద్దతు తెలిపారు. స్టార్మర్ తన చర్య పరిణామాల గురించి, యుకె మిత్రదేశాలపై దాని ప్రభావం గురించి ఆలోచించే శ్రమ తీసుకోలేదు. ఎంత దురదృష్టం అంటే, డోనాల్డ్‌కు స్టార్మర్ మద్దతు ప్రకటించినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు స్టార్మర్ పార్టీ నుండి వైదొలుగుతారని బహిరంగంగా ముందస్తుగా చెప్పేశారు. ఈ పరిణామం విదేశాల్లోని మితవాద నాయకత్వం నుండి అంతర్జాతీయ మద్దతు కొరవడిందని సూచించింది. సైనిక దాడులలో చేరడానికి మొదట్లో యుకె నిరాకరించినప్పటికీ, స్టార్మర్ చివరికి అమెరికా దళాలను బ్రిటిష్ స్థావరాలను పరిమితంగా ఉపయోగించుకునేందుకు అనుమతించారు.
ఇప్పుడు స్టార్మర్‌కు వేరే దారి లేని పరిస్థితి ఏర్పడింది. మితవాద శక్తుల మెప్పు కోసం ఆయన తీసుకున్న చర్యల ద్వారా లేబర్ పార్టీలోని వామపక్ష, సోషలిస్ట్ శక్తులను ప్రమాదంలో పడేశాడు. మితవాదులు కూడా దురదృష్టవశాత్తు ఆయనను పట్టించుకోలేదు. మితవాదం వైపు మారడంతో ఆయనకు ప్రధానంగా అండగా నిలిచిన ప్రగతిశీల వర్గాలు దూరమయ్యాయి. శీతాకాల ఇంధన భత్యాన్ని తగ్గించడంపై వివాదాస్పదంగా వెనక్కి తగ్గడం వంటి ఆర్థిక విధాన నిర్ణయాలు ఓటర్లు, వామపక్ష పార్టీ సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
‘అధికార వ్యామోహం’తో స్టార్మర్ సోషలిస్ట్ భావనలను విడిచిపెట్టారు.
2020 లేబర్ నార్టీ నాయకత్వ ప్రచారంలో తాను అనుసరించిన సిద్ధాంతాలను స్టార్మర్ క్రమపద్ధతిలో విచ్ఛిన్నం చేశారని విమర్శకులు, వామపక్ష మాజీ మిత్రులు విరుచుకుపడుతున్నారు. యుటిలిటీ(విద్యుత్, జల పంపిణీ తదితర) కంపెనీలను జాతీయం చేయడం, విశ్వవిద్యాలయ ట్యూషన్ ఫీజులను రద్దు చేయడం, కార్పొరేట్ పన్నులను పెంచడం వంటి వాగ్దానాలను ఉపసంహరించుకోవడం ఇందు లో భాగంగా ఉంది. అభ్యర్థుల ఎంపికపై పట్టు బిగించడం, మాజీ నాయకుడు జెరెమీ కార్బిన్ లేబర్ ఎంపిగా పోటీ చేయకుండా అడ్డుకోవడం, ముఖ్యమైన వామపక్ష వర్గాలను పార్టీకి దూరం చేయడం వంటి ఆయన నిర్ణయాలు… సంప్రదాయవాద ఓటర్లకు, పాలకులకు పార్టీని ఆమోదయోగ్యంగా మార్చేందుకు చేసిన అవకాశవాద చర్యలుగా పరిగణించబడ్డాయి. దశాబ్దాల కాలంలోనే అత్యంత ఘోరమైన ఓటమి (2019లో) నుండి లేబర్ పార్టీని రక్షించడానికి, దానిని తిరిగి అధికారంలోకి వచ్చే శక్తిగా మార్చడానికి ఈ సైద్ధాంతిక మార్పు అవసరమనే వాదనను ఆయన పార్టీ సభ్యుల ముందు ఉంచారు.
తన చర్యలను సమర్థించుకునేందుకు ఆయన మితవాద సిద్ధాంతాలను ఆశ్రయిస్తున్నారని తదుపరి పరిణామాలు రుజువు చేశాయి. ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం అంతటా ఈ చర్చ తీవ్రరూపం దాల్చింది. ఇది యుకె లేబర్ ఉద్యమంలో శాశ్వతమైన విభజన తీసుకువచ్చింది. ఆర్థిక స్తబ్దత, విధానపరమై న తప్పటడుగులు, స్పష్టమైన దార్శనికతను చూపించలేకపోవడం వంటి అంశాల కలయిక లేబర్ పార్టీకి తీవ్ర రాజకీయ నష్టాన్ని కలిగించింది. ఇటీవల కాలంలో పార్టీ సభ్యత్వ(పెయిడ్ మెంబర్‌షిప్) సంఖ్య 2,50,000 కంటే తక్కువకు పడిపోయింది. 2010ల చివరలో గరిష్టంగా 5,60,000 కు పైగా సభ్యులు ఉన్న స్థాయి నుంచి ఇది భారీ తగ్గుదలను సూచిస్తుంది. పార్టీలో తీవ్ర అంతర్గత తిరుగుబాట్లు, స్థానిక ఎన్నికల్లో భారీ ఓటములు, భారీగా సభ్యత్వం క్షీణించటం వంటి అనేక కీలక పరిణామాలు చివరికి 2026 జూన్ 22న కీర్ స్టార్మర్ రాజీనామాకు దారితీసాయి. స్టార్మర్ నేతృత్వంలో పార్టీ ఉద్దేశపూర్వకంగానే మాజీ నాయకుడు జెరెమీ కార్బిన్ వామపక్ష విధానాలకు దూరంగా జరిగింది. కార్బిన్‌ను సస్పెండ్ చేయడం, పలువురు వామపక్ష నాయకులను తొలగించడం వంటి చర్యలు పార్టీ నుంచి సాంప్రదాయ సోషలిస్ట్ మద్దతుదారులను పెద్ద ఎత్తున దూరం చేశాయి. ‘కార్బిన్ ప్రభంజనం’ సమయంలో మొదట చేరిన చాలా మంది సభ్యులు తమకు స్వాగతం లభించడం లేదని భావించి, తమ చెల్లింపు సభ్యత్వాల(పెయిడ్ మెంబర్‌షిప్)ను రద్దు చేసుకున్నారు. శీతాకాల ఇంధ న చెల్లింపులు, పిల్లల భృతిలో కోతలను ప్రతిపాదించినందుకు లేబర్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినప్పటికీ, 120 మందికి పైగా లేబర్ ఎంపి ల తిరుగుబాటు తర్వాత కొన్ని కోతలను వెనక్కి తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టార్మర్ మద్దతు పలకడం, అయనను మితవాద శక్తుల సహచరుడిగా చిత్రీకరించింది. ఇజ్రాయెల్- యుద్ధంలో తక్షణ కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం మొదట నిరాకరించడం తీవ్రమైన చీలికకు కారణమైంది. మానవతా సంక్షోభంపై పార్టీ నైతిక వైఖరి బలహీనంగా ఉందని భావించిన పదివేల మంది సభ్యులు నిరసనగా రాజీనామా చేశారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఆయన అస్పష్ట వైఖరి ఫలితంగా, 2026 మే మాసంలో జరిగి న స్థానిక ఎన్నికలలో, దాదా పు 22% మంది మాజీ లేబర్ ఓటర్లు గ్రీన్ పార్టీకి మారారు. జీవన వ్యయ సంక్షోభం, వలసలతో నిరాశకు గురైన కార్మిక వర్గ సభ్యులు ప్రజారంజక మితవాద పార్టీల వైపు మొగ్గారు. లేబర్ పార్టీ పడిపోతున్న సభ్యత్వ సంఖ్యలను తమ పార్టీ పెయిడ్ మెంబర్‌షిప్‌లో అధిగమించిందని నూత న పచ్చి మితవాద పార్టీ రిఫార్మ్ యుకె సైతం పేర్కొం ది. క్షేత్రస్థాయి మద్దతు లేకపోవడంతో, 2026 మేలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీ చారిత్రాత్మక పరాజయాన్ని చవిచూసింది.1,400కు పైగా సీట్లను, వేల్స్ పైన నియంత్రణను కోల్పోయింది. ఇది స్టార్మర్ నాయకత్వం పతనానికి దారితీసింది.
లేబర్ పార్టీని కొత్త కన్జర్వేటివ్ పార్టీగా మార్చడమే స్టార్మర్ ప్రధాన లక్ష్యం. ‘బోరిస్ జాన్సన్ నాయకత్వంలో బ్రెగ్జిట్ సమయంలో కన్జర్వేటివ్‌లు తమను తాము కార్మిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రజాకర్షక పార్టీగా పునఃరూపకల్పన చేసుకున్నప్పుడు, మధ్యేవాద స్థానం ఖాళీ అయింది. స్టార్మర్ “ఆ మధ్యేవాద స్థానాన్ని ఆక్రమించి, దేశాన్ని పటిష్టం చేస్తానని ప్రతినబూనారు” ఆయన లేబర్ పార్టీ ఆదర్శాలను నీరుగార్చడానికి ప్రయత్నించారు, ఇది పార్టీలోని అధిక సంఖ్య లో ఉన్న అనుచరులకు, సభ్యులకు ఆమోదయోగ్యం కాలేదు’ అని ‘ది స్టార్మర్ ప్రాజెక్ట్: ఎ జర్నీ టు ది రైట్’ రచయిత ఆలివర్ ఈగల్టన్ అన్నారు.జెరెమీ కార్బిన్ మద్దతుదారులు ప్రాథమికంగా అటువంటి ఏ చర్యకైనా వ్యతిరేకంగా నిలిచారు. కార్బిన్, స్టార్మర్ ఆధునిక బ్రిటిష్ లేబర్ పార్టీ రెండు విరుద్ధమైన సైద్ధాంతిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి సంబంధం మొదటి బెంచ్‌లో కలిసి కూర్చోవడం నుంచి బహిరంగ రాజకీయ యుద్ధం దాకా నాటకీయంగా మారింది. 2016 లో కార్బిన్ కు వ్యతిరేకంగా జరిగిన సామూహిక ఫ్రంట్ బెంచ్ రాజీనామాలో పాల్గొన్నప్పటికీ, స్టార్మర్ 2016 నుండి 2020 వరకు జెరెమీ కార్బిన్ నాయకత్వంలో షాడో బ్రెగ్జిట్ సెక్రటరీగా పనిచేశారు. కీర్ స్టార్మర్ బలవంతపు రాజీనామా చేయించటంలో కార్బిన్ ప్రత్యక్ష అంతర్గత పాత్ర పోషించలేదు. కానీ అందు కు దారితీసిన రాజకీయ వాతావరణాన్ని ఆయన సైద్ధాంతిక వారసత్వం, నిరంతర బాహ్య ఒత్తిడి గణనీయంగా ప్రభావితం చేశాయి.
జెరెమీ లేబర్ పార్టీ నుండి బలవంతంగా నిష్క్రమించినప్పటికీ, ‘కలెక్టివ్’, ‘మూమెంటం’ అనే రెండు వామపక్ష సంస్థలు ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లాయి. 2026 మేలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీ 1,000 పైగా కౌన్సిల్ సీట్లను కోల్పోయిన తరువాత, వారు స్టార్మర్‌ను తొలగించే ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇదే స్టార్మర్‌కు వ్యతిరేకంగా పార్టీలో అంతర్గత తిరుగుబాటుకు కారణమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ రేసులో ఆండీ బర్న్‌హమ్ ముందంజలో ఉన్నారు. కానీ, ప్రధాని పదవికి పోటీపడే వారిని ప్రభావితం చేయగల అసలైన సమస్యలపై రాబోయే రెండు నెలల్లో లేబర్ పార్టీ ఎంపిలు, ప్రాంతీయ నాయకులు కూడా చర్చించనున్నారు. ప్రధానిగా బర్న్‌హమ్ లేబర్ పార్టీకి పునరుజ్జీవం తీసుకురాగలరా? అదే అతి పెద్ద ప్రశ్న.