బొగ్గు రంగంలో వేగవంతమైన ప్రైవేటీకరణ
coal blocks
– ఎవిఎం
దేశ బొగ్గు రంగంలో గత కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంత వేగంగా, దశలవారీగా ప్రైవేటీకరిస్తోందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇటీవల జరిగిన మూడు ముఖ్యమైన సంఘటనలు ఈ ప్రక్రియకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
2026 మే నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)లో తన వాటాలో మరో 2 శాతాన్ని విక్రయించింది. దీంతో ప్రభుత్వ వాటా సుమారు 61 శాతానికి తగ్గిపోయింది. మరోవైపు, 2025 అక్టోబర్‌లో ప్రభుత్వం వాణిజ్య బొగ్గు గనుల 14వ విడత వేలాన్ని ప్రారంభించి 41 బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టింది. 2020 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 14 విడతల వేలాల్లో మొత్తం 141 బొగ్గు, లిగ్నైట్ గను లు ప్రైవేట్ రంగానికి కేటాయించబడ్డాయి. అలాగే 2026 ప్రారంభంలో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ రూ.2,500 కోట్ల విలువైన మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండిఒ) ఒప్పందాన్ని ఇన్నోవేటివ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంపిపిఎల్)కు అప్పగించింది. ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వం బొగ్గు రంగాన్ని మూడు ప్రధాన మార్గాల్లో ప్రైవేటీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొదటిగా, ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని వాటిని ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలకు వేలం వేస్తోంది. రెండవదిగా, ప్రభుత్వరంగ బొగ్గు కంపెనీల గనులను దీర్ఘకాలిక ఎండిఒ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోంది. మూడవదిగా, ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలలో ప్రభుత్వ వాటాను క్రమంగా తగ్గిస్తూ భవిష్యత్తులో పూర్తిస్థాయి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తోంది. భారతదేశంలో బొగ్గు రంగ ప్రైవేటీకరణ 1993లో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల భాగంగా ప్రారంభమైంది. అప్పట్లో ప్రైవేట్ కంపెనీలకు తమ స్వంత విద్యుత్, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల అవసరాల కోసం బొగ్గు గనులను నిర్వహించే అనుమతి ఇచ్చారు. ఇందుకోసం కోల్ మైన్స్ (జాతీయీకరణ) చట్టం సవరించారు.
2015లో కోల్ మైన్స్ (ప్రత్యేక నిబంధనలు) చట్టం అమల్లోకి రావడంతో బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే విధానానికి చట్టబద్ధత లభించింది. అనంతరం 2018లో ప్రైవేట్ సంస్థలకు వాణిజ్య బొగ్గు తవ్వకాలకూ అనుమతి ఇచ్చారు. 2020లో మినరల్ లాస్ (సవరణ) చట్టం ద్వారా ఈ రంగాన్ని పూర్తిగా సరళీకరించి, భారతదేశంలో మైనింగ్ అనుభవం లేకున్నా ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. 2026 మార్చి నాటికి ప్రభుత్వం 13 విడతలలో 135 బొగ్గు గనులను వేలం వేసింది. వీటి ద్వారా సంవత్సరానికి 325 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రైవేట్ క్యాప్టివ్, వాణిజ్య గనులు దేశ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025 సంవత్సరంలో ఈ గనుల నుంచి 210 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. వేలం వేసిన గనుల్లో అనేక గనులు గతంలో ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు కేటాయించినవే కావడం గమనించదగ్గ విషయం. అంటే ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేసే విధానం అమలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఎండిఒ విధానాన్ని బొగ్గు ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత వినియో గం, వ్యయ నియంత్రణ కోసం ప్రవేశపెట్టామని చెబుతున్నప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ అయిన కోల్ ఇండియాకు దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎండిఒ ఒప్పందాలు పొందిన సంస్థల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, దిలీప్ బిల్డ్‌న్, పవర్ మెక్ ప్రాజెక్ట్, సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్, ఎన్‌సిసి లిమిటెడ్ కెవిఆర్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిర్మాణ రంగానికి చెందినవే తప్ప బొగ్గు తవ్వకాలలో విశేష అనుభవం కలిగినవి కావు. కాబట్టి ఎండిఒ విధానం అసలు ఉద్దేశం ఉత్పత్తి పెంపు కాదని, ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లడమేనని స్పష్టమవుతోంది.