Skip to content
సంపాదకీయం వార్తలు

Editorial: స్టార్మర్‌ రాజీనామా లేబర్‌ను గట్టెక్కిస్తుందా?

Prajapaksham 23 Jun 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
Editorial: స్టార్మర్‌ రాజీనామా లేబర్‌ను గట్టెక్కిస్తుందా?

keir starmer ( Image Source: Social Media)

అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తీరుకు బ్రిటన్‌ రాజకీయ సంక్షోభం ప్రత్యక్ష నిదర్శనం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి ఘనవిజయం (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని 600సీట్లలో 403 సీట్లలో విజయం) సాధించిన ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ రెండేళ్లలోనే (2024 జులై 5న స్టార్మర్‌ యునైటెడ్‌ కింగ్‌డం ప్రధాని బాధ్యతలు చేబట్టారు) తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చిన పరిస్థితులు ఊహించనివి. 2016 నుంచి తమ పదవీకాలం ముగియకుండానే రాజీనామా చేసిన ఆరవ ప్రధానమంత్రి స్టార్మర్‌. అంటే లేబర్‌ లేదా కన్సర్వేటివ్‌ నేత ఎవరు అధికారంలో ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేకపోవటం, తదుపరి ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేగలడని తమ నాయకునిపై విశ్వాసం ఎంపిల్లో సన్నగిల్లటం అర్ధాంతరంగా ఈ మార్పులకు మూలం. అయితే కొత్తగా పదవిలోకి వచ్చిన నాయకుడూ కొద్దికాలంలోనే వైదొలగవలసి రావటానికి కారణం ఆ వ్యక్తి అసమర్ధతకాదు, వ్యవస్థను పీడిస్తున్న సంక్షోభం. యూరోపియన్‌ యూనియన్‌లో భాగస్వామి కావటంవల్లనే బ్రిటన్‌ ఆర్థికంగా నష్టపోయిందన్న భావన బలపడి ఆ యూనియన్‌ నుంచి బయటకు రావటానికి రెండు పట్టింది. ఆ తర్వాత కుదురుకోవటానికి మరో ఒకట్రెండు సంవత్సరాలు పట్టింది. అయినా ఇయుకు వెలుపల ఉంటూనే నాటో వ్యవహారాల్లో, యూరప్‌ భద్రత, ఉక్రేన్‌ యుద్ధంలో ఉక్రేన్‌కు అండగా ఇయుతో కలిసి పనిచేయక తప్పలేదు. అంటే ఇయు నుంచి బయటకు వచ్చినా యుకె యూరప్‌ రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఒత్తిళ్లకు గురవుతూనే ఉంది. మరోవైపున, ట్రంప్‌ ఒత్తిడి, బెదిరింపుల కారణంగా యూరప్‌ దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ కేటాయింపులు పెంచాల్సి వచ్చింది. దీంతో సామాజిక రంగానికి నిధుల కొరత, పర్యవసానంగా శ్రామికులు, మధ్యతరగతుల్లో అసంతృప్తి, ఆగ్రహం రాజకీయ వ్యవస్థలో మనోధైర్యాన్ని సడలిస్తున్నది.


స్టార్మర్‌ పరిపాలన ఏమంత అధ్వాన్నంగాలేదు. గత రెండేళ్లలో ఆర్థిక కొల్లబద్దలు కొంతమెరుగయినాయి. జి దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నిర్దేశించిన 2 శాతానికి తగ్గింది. మెడికల్‌ అపాయింట్‌మెంట్‌ల వెయిట్‌లిస్ట్‌ తగ్గింది. నికర వలస ప్రజల సంఖ్యలు కూడా తగ్గాయి. అయితే పాలక లేబర్‌ పార్టీలో స్టార్మర్‌కు తోడ్పాటు, ప్రజాభిప్రాయ పోల్స్‌లో ఆయన స్థితి దారుణంగా పడిపోవటం, రాజకీయ నియామకాల్లో అసమర్థులకు స్థానం, ఇంగ్లండ్‌లో ఇటీవల స్థానిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఓడిపోవటం, వేల్స్‌, స్కాట్‌లాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, రిఫార్మ్‌, ఇతర పచ్చి మితవాదపార్టీల పెరుగుదల లేబర్‌ పార్టీ భవిష్యత్‌పై సందేహాలు లేవనెత్తాయి. స్టార్మర్‌ ప్రధానమంత్రి అయిన సంవత్సరకాలంలోనే లేబర్‌పార్టీలో అంతర్గత తగాయిదాలు బద్దలయినాయి. లేబర్‌పార్టీ స్టార్మర్‌ నాయకత్వంలో తన లేబర్‌ మొగ్గునుంచి మధ్యేమార్గానికి జరిగినపుడే ఈ బీజాలు అంకురించాయి. పార్టీ సెమిటిజానికి వ్యతిరేకం అన్న భావన తొలగించటానికి అతివాద నాయకుడు జెరిమీ కోర్బిన్‌ను స్టార్మర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశాడు. 2025 జూన్‌లో సంక్షేమ చర్యలకు స్టార్మర్‌ ప్రతిపాదించిన కోతలను 120 మందికిపైగా లేబర్‌ ఎంపిలు వ్యతిరేకించటంతో ఆయన వెనక్కి తగ్గాడు.


2024 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయిన తదుపరి పచ్చి మితవాదులైన రిఫార్మ్‌ యుకె పార్టీ, ఇప్పుడు రెస్టోర్‌ బ్రిటన్‌ పార్టీ బలపడుతున్నాయి. లేబర్‌ పార్టీ మితవాదులు అతివాదుల నుంచి ఒత్తిళ్లకు గురవుతున్నది. స్టార్మర్‌ రాజీనామాకు కొంతకాలంగా పార్టీలో ఒత్తిడి వస్తుండగా ఆయన గట్టిగా తిరస్కరిస్తున్నాడు. గ్రేటర్‌ మాంచెస్టర్‌ లో ఉప ఎన్నికల్లో ఒక సీటును లేబర్‌ నుంచి గ్రీన్స్‌ గెలుచుకోవటం లేబర్‌ ఎంపిల్లో అలజడికి హేతువైంది. గ్రేటర్‌ మాంచెస్టర్‌ మాజీ మేయర్‌ యాండీ బర్న్‌హాం గతవారం ఉప ఎన్నికల్లో గెలిచి వెస్ట్‌ మినిస్టర్‌ (యుకె పార్లమెంటు)లో అడుగు పెట్టటం స్టార్మర్‌ భవిష్యత్‌ను నిలుపు చేసింది. ఆయన సోమవారం రాజీనామా చేశారు. అయితే నాయకుడు మారినంత మాత్రాన వ్యవస్థలో మార్పు రాదు. మితవాదులను ఎదుర్కోవ
టానికి కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి మితవాదంవైపుకు జరగటం ప్రజల్లో విశ్వాసం కలిగించదు. కార్మికవర్గ భావాలకు ప్రతినిధిగా ఉన్న జెరిమీ కోర్బిన్‌కు లేబర్‌ పార్టీలో తగు ప్రాతినిధ్యం ఇవ్వటం కార్మిక శ్రేణుల్లో పార్టీ కోల్పోయిన విశ్వాస పునరుద్ధరణకు తోడ్పడుతుంది. లెఫ్ట్‌ ఆఫ్‌ సెంటర్‌ విధానాలతోనే లేబర్‌పార్టీ తన ప్రతిష్టను పునరుద్ధరించకో గలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *