బెంగాల్, మహారాష్ట్ర తదుపరి పంజాబ్..
After Bengal and Maharashtra, Punjab is the BJP's next target.
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అనేక మాయపాయాలతో అధికారాన్ని చేజిక్కించుకోవటమే కాదు, ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌ను విజయవంతంగా ఛిద్రం చేస్తున్నది. 80లో 60మంది ఎమ్మెల్యేలు, 28మంది లోక్‌సభ ఎంపిల్లో 20మంది టిఎంసిని వీడటంలో బిజెపి చాణక్యం ఉంది. జిల్లాల్లో దాడులతో పలువురు నాయకులు రాజీనామా చేస్తున్నారు. అవినీతి కేసులతో అరెస్టు చేస్తున్నారు. రూ.400కోట్లకు పైగా తృణమూల్ కాంగ్రెస్ అక్కౌంట్లను ప్రత్యర్థుల ఫిర్యాదుపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్తంభింపజేసింది. మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో బిజెపి మిత్రపక్షం శివసేన (షిండే) ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో శివసేన (యుబిటి) లోక్‌సభ సభ్యులు 9మందిలో ఆరుగురిని (ఫిరాయింపుల నిరోధక చట్టం కోరలనుంచి తప్పించుకునేందుకు మూడింట రెండు వంతులు గోడదూకేటట్లు జాగ్రత్త తీసుకున్నారు) తనలో ఐక్యం చేసుకుంది.
వారం రోజులపైబడి వార్తల్లో ఉన్న ఈ ఫిరాయింపు వ్యవహారాన్ని సఫలం చేయటంలో బిజెపి నాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావీస్ పాత్ర విస్మరించరానిది. అదీ అధికారానికున్న మహత్తు. తెరవెనుక ఏమి జరిగిందనే శల్యపరీక్ష కన్నా ఫలితమే ముఖ్యం కదా! ఆ ఆరుగురు సోమవారం మధ్యాహ్నం షిండేను కలిసి ఆయన పార్టీలో చేరారు. వారిని ఆహ్వానించిన షిండే తమదే అసలు సిసలు శివసేన అని, బాబాసాహెబ్ బాల్ థాక్రే సిద్ధాంతానికి తామే వారసులమని ప్రకటించారు. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం బిజెపి నాయకత్వం చేస్తున్న తెరమరుగు ప్రయత్నాల్లో ఇది మరో పర్వం. మధ్యప్రదేశ్‌లో దుర్మార్గంగా కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావటం, జార్ఖండ్‌లో రిలయెన్స్ సంస్థకు చెందిన కుబేరుడు నత్వానీకి తోడ్పడి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించటం ఇందులో భాగమే. పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం కూడా వ్యూహాత్మకంగానే భావించబడుతున్నది.
వారి సీట్లు భర్తీ చేయటానికి బెంగాల్ అసెంబ్లీ నుంచి జరిగే ఉప ఎన్నికల్లో బిజెపి తన అభ్యర్థులను సునాయాసంగా గెలిపించుకుని రాజ్యసభలో తన సంఖ్యను పెంచుకోవచ్చు.
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను సూక్ష్మంగా గుర్తు చేసుకుంటే బిజెపి ఎంత వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను ముక్కలు చేసి అధికార పీఠాన్ని చేజిక్కించుకుందో విదితమవుతుంది. కరడుగట్టిన హిందూత్వ పార్టీ బాల్‌థాక్రే నెలకొల్పిన శివసేన. భూమి పుత్రులకే ఉద్యోగాల పేరుతో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలవారిపై దాడులతో, మరోవైపున హిందూత్వతో 1970 దశకాల్లో ఒక దుందుడుకు శక్తిగా శివసేన చక్రం తిప్పింది. మాతోశ్రీ (థాక్రే గృహం) నిర్ణయమే శాసనం. బిజెపి జూనియర్ భాగస్వామిగా శివసేనతో జతకట్టింది. 1995 సేనతో అధికారం పంచుకుంది. బాల్‌థాక్రే తమ్ముని కొడుకు శివసేన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న రాజ్‌థాక్రే నాయకత్వ వారసత్వం ఆశించి భంగపడ్డాడు. నీటికన్నా రక్తమే చిక్కన అన్నట్లు బాల్‌థాక్రే తన కుమారుడు ఉద్ధావ్ థాక్రేను వారసునిగా నియమించి కన్నుమూశారు. రాజ్‌థాక్రే ‘మహారాష్ట్ర నవనిర్మాణసమితి’ ఏర్పాటు చేసుకుని రాజకీయంగా ముందుకు రాలేకపోయాడు. చగన్ భుజబల్, నారాయణ్ రాణా వంటి పలుకుబడిగల నాయకులు శివసేననుంచి నిష్క్రమించారు.
కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో అవగాహనతో పడ్నావీస్ తొలిసారి ముఖ్యమంత్రి అయినారు. 2019లో ఐదు రోజుల్లో రాజీనామా చేశారు. 2024 డిసెంబర్‌లో మూడవసారి ముఖ్యమంత్రి అయినారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవిని బిజెపి నిరాకరించటంతో 2019 ఎన్నికలు అనంతరం రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ క్రమంలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. బిజెపి ఏక్‌నాథ్ షిండే ద్వారా ముందుగా శివసేనను, ఆ తర్వాత అజిత్ పవార్ ద్వారా ఎన్‌సిపిని చీల్చి ఏక్‌నాధ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది. ఆయన నాయకత్వంలోనే 2024లో ఎన్నికలకు వెళ్లిన బిజెపి, ఫలితాల అనంతరం పడ్నావీస్‌ను ముఖ్యమంత్రిని చేసి షిండే, పవార్‌లు ఉపముఖ్యమంత్రులుగా ఏలుబడి ప్రారంభించింది. షిండే కుమారుడు నరేంద్రమోదీ మంత్రివర్గంలో ఉన్నారు. ఎన్నికల గుర్తుపై సుప్రీంకోర్టు కెళ్లిన షిండే మెజారిటీ తోడ్పాటు కారణంగా శివసేన(షిండే) పేరును, బాణం గుర్తు ను పొందారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానంతరం ఎన్‌సిపిని ఏకం చేసే ప్రయత్నాలు జరిగినా, అజిత్ భార్య సునేత్ర పవార్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవి చేబట్టి ఆ ప్రయత్నం భగ్నం చేశారు. ఆ విధంగా బిజెపి మహారాష్ట్రపై, వాణిజ్య రాజధానిగా పిలవబడే ముంబయిపై ఆధిపత్యం సంపాదించింది. కాగా అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన(ఉద్ధావ్), అత్యధిక సీట్లు సాధించినందున, ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి షిండేసేనతో కలిసి కొంత మెరుగైన స్థితికి చేరింది.
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్‌పై బిజెపి ఇప్పుడు దృష్టి పెట్టింది. ఒకప్పుడు అది అకాలీదళ్‌కు జూనియర్ పార్టనర్. పంజాబ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉంది. మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లుల కారణంగా అకాలీదళ్ బిజెపితో సంబంధాలు తెంచుకుంది. హిందువులందరినీ తమవైపుకు తెచ్చుకోవటం, అకాలీలతో పొత్తు పునరుద్ధరించుకోవటం, ఆప్‌ను చీల్చటం తదితర వ్యూహాలతో బిజెపి ముందుకు సాగుతోంది. బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం చండీఘడ్‌లో మాట్లాడుతూ, “పంజాబ్ మార్పుకు సిద్ధంగా ఉంది. పంజాబ్ ప్రజలు ఎంతో ఆశతో, అంచనాలతో బిజెపి వైపు చూస్తున్నారు” అన్నారు. “పంజాబ్‌ను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటకు తీసుకురావటం, దాన్ని సురక్షితం, సంపద్వంతం, శక్తిమంతం చేయటం బిజెపి ప్రధాన ఎజండా” అని ప్రకటించారు. ఇది కాంగ్రెస్‌కు, ఆప్‌కే కాదు అకాలీదళ్‌కు కూడా హెచ్చరిక.