కూటమి సర్కార్‌కు పేర్ని నాని సవాల్.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.. డీఎస్సీ పాపాలు మిమ్మల్ని వదలవు!
Perni Nani Throws Open Challenge to Chandrababu Over Arrest Controversy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఐదుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్రలను టార్గెట్ చేస్తూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక బహిరంగ సవాల్ విసిరారు.
“నేను బియ్యం దొంగతనం చేశానని నాపై పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. మీకు నిజంగా ధైర్యముంటే, నాపై తక్షణమే విచారణ జరిపించి నన్ను జైల్లో పెట్టండి. 2029 నాటికి చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా పడిపోవడం ఖాయం. అంతవరకు మీకు చేతనైతే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి” అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్ని నాని ఈ సందర్భంగా ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొదట క్రీడా కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చిందని, ఆ తర్వాత 382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఇటీవలే ఆటల సంఖ్యను 29 నుంచి ఏకంగా 67 కి పెంచి, అందులో ‘బ్రిడ్జ్’ (పేకాట) ను కూడా చేర్చడం ఏంటని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎంపికైన అభ్యర్థుల అధికారిక జాబితాను గత 9 నెలలుగా ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచడం లేదు? బాధ్యతాయుతమైన ఒక ఐఏఎస్ అధికారి సంతకం కూడా లేకుండా ఆ లిస్ట్‌ను ఎలా విడుదల చేశారు? ఇప్పుడు కార్డు గేమ్స్ (పేకాట) ఆడేవారిని తాము ఎంపిక చేయలేదంటూ ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తోందని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రయత్నిస్తోందని పేర్ని నాని ఆరోపించారు. ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి హోంమంత్రి అనితను ప్రభుత్వం ఒక కవచంలా వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నిత్యం జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు డీఎస్సీ స్కామ్‌ను లేవనెత్తినప్పుడు మాత్రం ఒక్కసారిగా హైపర్యాక్టివ్గా మారుతోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన ‘పాపాలు’ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన క్యాబినెట్ మంత్రులను ఎప్పటికీ వదిలిపెట్టవని పేర్ని నాని హెచ్చరించారు.