Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్

Prajapaksham 03 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్

I Couldn't Become Andhra CM, How Can I Become Telangana CM?” – Pawan Kalyan

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం కారణంగానే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అయితే దురదృష్టవశాత్తూ అలాంటి మహానాయకులను కులచట్రాల్లో బంధించడం రాజకీయాల్లో ఒక అలవాటుగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో పర్యటించిన ఆయన, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ పరిణామాలు, ఏపీలోని కుల రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సమాజంలో ఇప్పటికీ ప్రాంతీయ భావోద్వేగం బలంగా ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి వాతావరణం కనిపించడం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఒక మహానుభావుడిని ఇక్కడ కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేశారని ఆయన విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కులదూషణలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.

యువతకు నిరుద్యోగ సమస్య, రాష్ట్ర అభివృద్ధి వంటి కీలక అంశాలను పూర్తిగా పక్కనబెట్టేసి, సమాజంలో కులాల కుంపట్లు పెట్టారని ఆరోపించారు. సమాజంలో కనిపిస్తున్న ఇలాంటి దుర్మార్గాన్ని, విద్వేష వాతావరణాన్ని అడ్డుకోవాలనే సంకల్పంతోనే తాము ‘సేనాగళం’ పేరుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీలో అన్ని వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలో తమకు ఇష్టం వచ్చినట్లు ఇతరులపై మాట్లాడి, ఆ తర్వాత తప్పును కప్పిపుచ్చుకోవడానికి కులం వెనుక దాక్కునే సంస్కృతికి ఇకనైనా ముగింపు పలకాలని ఆయన హితవు పలికారు.

ఇక తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ, ఇటీవలి వివాదాలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. తెలంగాణలో తాము పార్టీ ఆఫీసును తీసేసినప్పటికీ, అక్కడ జనసైనికులు, నాయకులు క్షేత్రస్థాయిలో అలాగే బలంగా ఉన్నారని చెప్పారు. నిన్న అక్కడ చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాల వల్లే తాను తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై అధికారిక ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరించారు. దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాను గట్టిగా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణ సమాజం అన్నా, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని, భవిష్యత్తులో తెలంగాణ బాగుకోసం నిరంతరం పనిచేస్తామని పునరుద్ఘాటించారు.

తెలంగాణ అనేది ముమ్మాటికీ అక్కడి భూమిపుత్రుల జాగీరేనని, ఆ నిజాన్ని ఎవరూ కాదనలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే, వేరే ప్రాంతాల వారిని అసలు అక్కడికి రానివ్వబోమని కొందరు మాట్లాడటంపైనే తాను అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపారు. నాడు గద్దర్ వంటి గొప్ప నాయకులు ఎప్పుడూ కూడా ఇతరులను రావొద్దంటూ సంకుచితంగా మాట్లాడలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనకు సోదరుడితో సమానమని పేర్కొన్న పవన్, ఈ వివాదంపై ఆయన ఏం మాట్లాడారో తాను ఇంకా పూర్తిగా వినలేదని చెప్పారు.

ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకులు ఎవరూ వెళ్లి తెలంగాణలో నేరుగా పోటీ చేయడం లేదని, రేపు ఎన్నికల్లో జనసేన తరఫున తెలంగాణ భూమి పుత్రులే నిలబడి పోటీ చేస్తామంటుంటే అందులో ఇతరులకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారిందని, దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా లేదా అనేది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. సమాజంలో ఇలాంటి అనవసర విద్వేషాలకు ముగింపు పలికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలనేదే తన ముఖ్య ఆలోచన అని పవన్ కల్యాణ్ ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *