Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కోస్తాలో వర్షాలు.. రాయలసీమలో ఎండలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల వారీగా మారుతున్న వాతావరణ పరిస్థితులు..

Prajapaksham 03 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
కోస్తాలో వర్షాలు.. రాయలసీమలో ఎండలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల వారీగా మారుతున్న వాతావరణ పరిస్థితులు..

Heatwave Conditions in Telangana Till June 24, Heavy Rains to Follow

ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆయన వివరించారు.

ఈ ద్రోణి ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

వర్ష సూచన ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాలు, విజయనగరం జిల్లాలోని 6 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందన్నారు. వీటితో పాటు మరో 28 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించారు.

ఇక మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాష్ట్రంలోనే అత్యధికంగా గూడూరులో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీని తర్వాత పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 44.9 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

ట్యాగ్‌లు: Rayalaseema weather