ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ భవిష్యత్తు.. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Inaugurates Telangana Public School at Arutla key points
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరుట్లలో ప్రారంభించిన ఈ పాఠశాలను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లోనో, రంగుల గోడల్లోనో లేదని, అది ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. విద్యా కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1814 మంది విద్యార్థులు చేరారని, ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి రావడం గర్వకారణమని సీఎం పేర్కొంటూ, ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే తాము ఈ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే ఎందరో గొప్ప నాయకులుగా, అధికారులుగా ఎదిగారని, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో పాటు తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకుని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరగలిగానని వివరించారు. విద్యార్థులు చదువులో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు కిట్స్ అందించే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు స్థాపించిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ భవనాన్ని రాబోయే డిసెంబరు 9న ప్రారంభించుకోబోతున్నట్లు వెల్లడించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్… యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తీసుకువచ్చి విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడించామని, అయితే దీనిపై కూడా ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని సీఎం దుయ్యబట్టారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా మిగలదని హెచ్చరించారు. ప్రజలు తమకు అండగా నిలబడితే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తూ తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.